వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండే పోటీ:ఇళ్ల పంపిణీలో అవినీతిపై ప్రత్యర్థులకు సవాల్ చేసిన బాలినేని
వచ్చే ఎన్నిల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మంగళవారంనాడు ఆయన ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఒంగోలు ఎంపీ స్థానం నుండి మాగుంట శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయమై రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదన్నారు.
మరో వైపు ఇళ్ల పంపిణీలో తాను అవినీతికి పాల్పడినట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు. ఈ విషయమై తనపై ప్రత్యర్ధి పార్టీలు చేస్తున్న విమర్శలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కేసులతో అడ్డుకుంటారా? అని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు. నాడు 14 వేల మందితో డబ్బులు కట్టించుకొని 4 వేల మందికి ఇండ్లు ఇచ్చారన్నారు. టీడీపీ హయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.