Asianet News TeluguAsianet News Telugu

ఆరు కోట్ల ఆంధ్రులు మీ వెంటే: ప్రధాని మోడీతో జగన్

వివిధ రాజకీయ పార్టీలతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న  రాష్ట్ర ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్. ‌ 
 

I along with Six crore AP People Are With You: AP CM YS Jagan Assures PM Modi In Video Conference
Author
Amaravathi, First Published Jun 19, 2020, 10:06 PM IST

భారత్ చైనా సరిహద్దులో చైనా దురాగతానికి 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో... చైనా తో అనుసరించాల్సిన వ్యూహంపై నేడు ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఇక ఈ సమావేశంలో ఘటన వివరాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అందరికి వివరించారు. ఆ తరువాత భారత్, చైనా సరిహద్దు వివరాలపై రాజకీయ పార్టీల నేతలకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ను విదేశాంగ శాఖ మంత్రి డా ఎస్‌.జయశంకర్‌ ఇచ్చారు. 
సరిహద్దు సమస్య పరిష్కారం కోసం దశాబ్దాలుగా జరుగుతున్న చర్చలు, వాటి వివరాలను కేంద్ర మంత్రి జయశంకర్ అందరికి వివరించారు. ఇదివరకు కుదిరిన ఒప్పందాల్లోని కీలక అంశాలను, 1950–60 మధ్య తూర్పు లదాక్‌ ప్రాంతంలో జరిగిన ఘటనలను మంత్రి జయశంకర్ వివరించారు. 

సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం వివరాలను తెలియజేసారు జయశంకర్. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జరుగుతున్న పరిణామాలను అందరికి జయ శంకర్ వివరించారు. ‌ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 20 పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

ముఖ్యమంత్రి ప్రసంగంలోని కీలక అంశాలు:

"20 మంది వీర సైనికుల మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. గాల్వాన్‌ లోయ వద్ద జూన్‌ 15న జరిగిన ఘటనలో మన దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు, వారి త్యాగాలకు మా రాష్ట్రం తరఫున సెల్యూట్‌ చేస్తున్నాను.

ఆ వీర సైనికులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇవ్వాళ్టి అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులంతా భుజం భుజం కలిపి.. మరణించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత అణ్వస్త్ర యుగంలో ప్రపంచం మారుతోంది. కేవలం సైన్యంతో మాత్రమే యుద్ధం చేయలేం. దౌత్యం, వ్యాపార, ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా వివిధ రకాలుగా యుద్ధం చేయొచ్చు.

మనం ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఈ ఘర్షణల్లో వారు ఆయుధాలను వాడలేదు. అలాగే అటువైపున కూడా సైనిక నష్టం జరిగిందనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి. 2014 నుంచి అంతర్జాతీయంగా మన దేశ గౌరవం, ప్రతిష్ట ఇనుమడించిందనే విషయాన్ని ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు అంతా అంగీకరిస్తారనే అనుకుంటున్నాను.
భారత్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి మోదీ కృషి చేశారు. విశ్వవ్యాప్తంగా మన దేశ ప్రతిష్టలు పెరిగాయి. ప్రధాని వివిధ దేశాల్లో విస్తృత పర్యటనలు ద్వారా, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయంగా సంబంధాలు మరింత బలపడ్డాయి, ప్రధాని మోదీ భారత్‌ను ముందు వరుసలో నడిపించారు.

ప్రపంచవ్యాప్తంగా బలమైన దేశంగా నిలిచిన భారత్‌ ఇతర దేశాలకు దారి చూపించింది. ప్రధాని విజయవంతమైన విదేశీ విధానాల ద్వారా 3 రకాల ఇంటర్నేషనల్‌ కంట్రోల్‌ రెజిమ్స్ ‌లో భారత్‌ చోటు సాధించింది. దీని వల్ల అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సాధించాం.
క్షిపణులు – జీవ రసాయన ఆయుధాలు – ఆయుధాలు, వసెనర్‌ అగ్రిమెంట్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత్‌ చోటు సాధించింది. 192 సభ్య దేశాలున్న ఐక్య రాజ్యసమితిలో భారత్‌ 184 మంది సభ్యుల మద్దతుతో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలిలో సభ్యదేశంగా ఎంపికైంది.

గ్లోబల్‌ స్టేట్స్‌మన్‌గా ప్రధానమంత్రి గారు చూపిన అసాధారణ నైపుణ్యం వల్లనే ఈ చిరస్మరణీయమైన విజయాలు సాధ్యమయ్యాయి. ఈ అసాధారణ విజయాలు పలువురికి మన విజయాలు కంటగింపుగా మారాయి. పరోక్ష శక్తుల ద్వారా దేశాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించారు. 

ఇన్ని శక్తులు మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నప్పటికీ ప్రధాని సమర్థమైన నాయకత్వంలో విజయం సాధించి ముందుకెళ్తున్నాం. పలు సమస్యలు ఉత్పన్నమైనప్పడు ప్రధాని చాలా చురుగ్గా, వేగంగా స్పందించారు. పుల్వామా దాడి, డోక్లాం సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటింప చేయడంతోపాటు, అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషన్‌ జాదవ్‌ కేసులో 15–1 ఓట్ల తేడాతో వచ్చిన తీర్పు... మీ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మీ  సమర్థ నాయకత్వంలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. గాల్వాన్‌ లోయలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నేను నిశితంగా గమనిస్తున్నాను. అక్కడ జరిగిన ఘటనలు, ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి, మా కంటే కేంద్రంలో ఉన్న వారికే బాగా తెలుసు కాబట్టి, ఈ విషయంలో మరింత లోతుగా వెళ్లదలచుకోలేదు.

ఈ పరిస్థితుల్లో ప్రధాని తన దార్శినికత, దౌత్య సంబంధాలను వినియోగించుకోవడం ద్వారా ఈ సమస్యలకు ఒక పరిష్కారం కొనుక్కొంటారని విశ్వాసంతో ఉన్నాం. ఈ పరీక్షా సమంలో, క్లిష్ట పరిస్థితుల్లో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడిగానే కాదు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ వెనుక ఉంటాను. మా రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు కూడా మనస్ఫూర్తిగా మీకు మద్దతు తెలుపుతున్నారు.

 మీ సమర్థ నాయకత్వంపైన  మాకు పూర్తి నమ్మకం ఉంది.... గాల్వాన్‌ సంక్షోభంలో ఈ దేశాన్ని మీరు సరైన మార్గంలో విజయవంతంగా నడిపిస్తారని నమ్ముతున్నాం. ఈ పరీక్షా సమయాలను ఎదుర్కొని అన్ని సమస్యలనూ అధిగమించి భారత్‌ మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈ సంక్షోభం సమయంలో ఏ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉంటాం." అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios