పల్లెకి పట్న వాసి .. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు 1.24 లక్షల వాహనాలు, రెండ్రోజుల్లోనే
తెలుగువారి పెద్ద పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకునేందుకు నగర ప్రజలు తమ స్వగ్రామాలకు బయల్దేరి వెళ్లారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు 1.24 లక్షల వాహనాలు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి రెండు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పండక్కి సొంతూళ్లకి తరలివస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్లు ఇతర రవాణా సాధనాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి పట్నవాసులు పల్లెలకు వెళ్లడంతో నగరం ఖాళీ అయ్యింది. గత రెండు రోజులుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు 1.24 లక్షల వాహనాలు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
జనవరి 12న 56,500... జనవరి 13న 67,500 వాహనాలు విజయవాడ వైపునకు వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ పంతంగి టోల్ గేట్ మీదుగా వెళ్లినవే. నగరాన్ని వీడి వెళ్లిన వారిలో 90 శాతం మంది వ్యక్తిగత వాహనాల్లోనే సొంతూళ్లకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపుకు శుక్రవారం 26 వేల వాహనాలు వెళ్లగా... అటు నుంచి ఇటు వైపు 13 వేల వాహనాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఎల్బీ నగర్, ఉప్పల్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. టోల్‌గేట్ల వద్ద ఆర్టీసీ బస్సులు, కార్లు, లారీలకు విడివిడిగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రజా రవాణా సాధనాలకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
Also REad: కోడి పందాల నిర్వాహకుల సరికొత్త ఐడియా.. బుల్లెట్ బైక్ ఆఫర్.. ఎక్కడంటే..
మరోవైపు.. సంక్రాంతి పండగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోడి పందాల బరులు వెలిశాయి. మూడు రోజుల పాటు కోడి పందాలు జరిపేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి వేళలో కూడా పందాలు కొనసాగేలా బరుల వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. పందెంలో బరిలో దింపే కోళ్లకు కొన్ని నెలల ముందు నుంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చి బరుల్లో దింపుతున్నారు. కోడి పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు ఏపీకి భారీ చేరుకుంటున్నారు.
కొన్నిచోట్ల కోడి పందాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. కోడి పందాల్లో కోట్లలో డబ్బు చేతులు మారనుంది. కొన్నిచోట్ల కోడి పందాలతో పాటు గుండాట బరులు వెలిశాయి. గుండాటలో కూడా లక్షల రూపాయలు చేతులు మారనుంది. కోడి పందాల్లో పాల్గొనేవారి కోసం పలుచోట్ల క్యూ ఆర్ కోడ్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే కోడి పందాలను అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న.. నిర్వాహకులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లో కోడి పందాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే సంప్రదాయం ముసుగులో కొన్ని చోట్ల పందెంరాయుళ్లు నిర్వాహకులు కోళ్ళకు కత్తి కట్టి బరిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.