అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
ఇంటికి వచ్చిన భర్తను చూసిన భార్య తలుపు తీసింది. అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న సోమేలు అశ్వినిని కోపంతో రగిలిపోయాడు. పక్కనే ఉన్న రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. దాంతో అశ్విని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

విజయవాడ : కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతంగా మారడంతో కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు.
జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లినాడు ప్రమాణం చేసి అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాడు. భార్యను చంపేసి పోలీసులకు లొంగిపోయాడు. శాశ్వతంగా తల్లిదూరం కావడం, తండ్రి జైలుపాలవ్వడంతో ఇద్దరు చిన్నారులు బోరున విలపిస్తున్నారు.
ఈ ఘటన విజయవాడ రూరల్ నిడమానూరులో చోటు చేసుకుంది. రామ్ నగర్ కు చెందిన సోమేలు లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సోమేలుకు భార్య అశ్వినితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశ్వినిని గత కొంతకాలంగా అనుమానిస్తున్నాడు సోమేలు.
అశ్విని ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని ఆరోపిస్తూ నిత్యం గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఇదే విషయమై భార్యభర్తల మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. గొడవ జరగడంతో సోమేలు రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం ఇంటికి తిరిగివచ్చాడు.
ఇంటికి వచ్చిన భర్తను చూసిన భార్య తలుపు తీసింది. అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న సోమేలు అశ్వినిని కోపంతో రగిలిపోయాడు. పక్కనే ఉన్న రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. దాంతో అశ్విని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
భార్య మరణించిందని నిర్ధారించుకున్న సోమేలు అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అంతేకాకుండా తన భార్య మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సైతం పోలీసులకు అందజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇకపోతే అశ్వినిని హత్య చేసిన అనంతరం సోమేలు తమకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాడని మృతురాలి తల్లి పోలీసులకు స్పష్టం చేసింది. కోపంలో అన్నాడనుకున్నామే కానీ ఇంతలా చేస్తాడని అనుకోలేదని బోరున విలపించింది.
తమ కూతురు, అల్లుడికి గొడవ జరిగిందని, ఇదే విషయం ఫోన్‌లో చెప్పారని చెప్పుకొచ్చింది. ఉదయం వచ్చి మాట్లాడతామని చెప్పామని ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని పోలీసుల ఎదుట వాపోయింది.