మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి... ఆ మద్యం మత్తులోనే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. కరెంట్ షాకిచ్చి మరీ భార్యను చంపేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తోకపల్లి గ్రామానికి చెందిన శ్రావణి(24)ని మద్దిలకట్ట ఎస్సీ కాలనీ కి  చెందిన తంగిరాల యోహాన్ తో 2014లో వివాహమైంది. పెళ్లికి ముందే మద్యం అలవాటు ఉన్న యోహాన్... ఆ తర్వాత మద్యానికి మరింత అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో తరచూ భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.

కాగా... ఇదే విషయంలో సోమవారం రాత్రి కూడా భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమె నిద్రించిన తర్వాత విద్యుత్‌ తీగలను భార్య మెడకు తాకించి షాక్‌ ఇచ్చాడు. శ్రావణి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది.

యోహాన్‌ మంగళవారం ఉదయం శ్రావణి ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు అక్కడనుంచి పరారయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు ఎస్సై డి.రామకృష్ణ అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. నిందితుడి కుటుంబసభ్యలు కూడా పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.