అమ్మని చంపొద్దు నాన్న.. మమ్మల్ని తల్లిలేని పిల్లలను చేయవద్దు అంటూ... ఆ పిల్లలు కన్న తండ్రిని బతిమిలాడుకున్నారు. కానీ ఆ తండ్రి కనికరించలేదు. కనికరం లేకుండా కన్న బిడ్డలు  చూస్తుండగానే... కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... నాయుడుపేట మండలం వద్దిగుంటకండ్రిగకు చెందిన మునిరాజా అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం ప్రమీల(29) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె లావణ్య ఎనిమిదో తరగతి , రెండో కుమార్తె మాధురి ఆరో తరగతి చదువుతున్నారు. వీరు స్థానికంగా ఉన్న నాయుడుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.

మునిరాజా, ప్రమీల ఇద్దరూ దగ్గరి బంధువులే. వీరికి 13ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోగా... పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే... కొద్ది రోజుల క్రితం నుంచి మునిరాజాకి భార్య ప్రమీల మీద అనుమానం ఏర్పడింది. మరో వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం రోజు రోజుకీ బలపడింది. ఈ విషయంలో భార్యతో తరచూ గొడవ పడుతూనే ఉన్నాడు.

ఆదివారం రాత్రి కూడా భార్యభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. భార్య మలమూత్ర విసర్జనకు రాత్రివేళ బయటకు వెళ్లగా... ఎవరితో తిరగడానికి వెళ్లావంటూ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మునిరాజా భార్యపై కత్తితో దాడిచేయడానికి ప్రయత్నించాడు.

తండ్రి.. తమ కన్న తల్లిని చంపాలని చూడటం చూసి ఇద్దరు కూతుళ్లు కంగారు పడిపోయారు. వెంటనే తల్లిని చంపవద్దని తండ్రి ప్రాదేయపడ్డారు. చాలా సేపు తండ్రిని బ్రతిమిలాడారు. కానీ..కూతుళ్ల విన్నపాన్ని తండ్రి వినిపించుకోలేదు. ఎంత కోరినా తండ్రి వాళ్ల మాట వినిపించుకోలేదు. కూతుళ్లు చూస్తుండగానే... భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికి హత్య చేశాడు.

అడ్డువస్తే కూతుళ్లను కూడా చంపేస్తానని బెదిరించాడు. కాగా... పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతుళ్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మునిరాజ్ కోసం గాలిస్తున్నారు.