కర్నూలు జిల్లా వెలుగోడులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యను చెట్టుకు కట్టేసి.. కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు అక్కడే పడిపోగా... స్థానికులు గమనించి రక్షించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... వెలుగోడుకు చెందిన హుస్సేన్ కి లక్ష్మీదేవి అనే మహిళతో వివాహం జరిగింది. కాగా... కొంతకాలం పాటు వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. అయితే... ఇటీవల హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై భార్యభర్తల మధ్య పెద్దపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భర్తపై లక్ష్మీ దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు భార్య భర్తలిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చిన పంపించారు. ఇది మనసులో పెట్టుకుని, భార్యపై కక్ష పెంచుకున్న భర్త హుస్సేన్.. స్వగ్రామం బన్నూరుకు వెలుతుండగా బలవంతంగా ఆమెను చెట్టుకు కట్టేసి కత్తితో పొడిచాడు. స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.