ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అసమర్ధత వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా ఉన్న కంపనీలు మూతపడటం, ఇతర రాష్ట్రాలను తరలిపోవడం జరుగుతోందని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

విశాఖపట్నం: సబ్జెక్ట్ లేని సీఎం జగన్ రెడ్డి (ys jagan) మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే రాష్ట్రంలోని కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఆందోళన వ్యక్తం చేసారు. గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ (Visakhapatnam) ఇప్పుడు వెలవెలబోతోందన్నారు. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బిసి మూతపడటం బాధాకరమని లోకేష్ అన్నారు. 

''రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బిసి (HSBC) కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనం. మూడు రాజధానుల (three capitals) పేరుతో చేసిన మోసం చాలు. విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలి'' అని లోకేష్ హెచ్చరించారు.

విశాఖలో పదిహేనేళ్ల క్రితం 3 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ హెచ్‌ఎస్‌బి‌సి కంపెనీ ఏర్పాటయ్యింది. అయితే బీపీవో (BPO) కాల్ సెంటర్ల నిర్వహణలో అంతర్జాతీయంగా పేరొందిన ఈ సంస్థ ఇటీవలం కాలంలో అనేక సమస్యలతో సతమతం అవుతోంది. దీంతో విశాఖపట్నంలోని శాఖను మూసేయాలని హెచ్ఎస్బిసి నిర్ణయించింది.

READ MORE పీఆర్సీపై పీటముడి: జగన్‌తో బుగ్గన, సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ

కేవలం విశాఖపట్నంలోనే కాకుండా వివిద రాష్ట్రాల్లోని 24 కాల్ సెంటర్లను మూసేయాలని హెచ్ఎస్బిసి సంస్థ నిర్ణయించింది. దేశంలోని 50 కేంద్రాల్లో 24 శాఖలను మూసేసి 14 నగరాల్లోని 26 శాఖలతో తన కార్యకలాపాలను కొనసాగించాలని ఆ సంస్థ భావిస్తోంది. దీంతో విశాఖతో పాటు వివిధ నగరాల్లో ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపివేసింది. 

గతంలోనూ పలు కంపనీలు జగన్ స‌ర్కారు మూర్ఖ‌పు వైఖ‌రితో ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని లోకేష్ ఆరోపించారు. రిల‌య‌న్స్ ఏపీలో ప్లాంటుని ఏర్పాటుని విర‌మించుకుంద‌ని... ట్రైటాన్ తెలంగాణ త‌ర‌లిపోయింద‌ని ఆందోళన వ్యక్తం చేసారు. రిల‌య‌న్స్, ట్రైటాన్‌లు వ‌ల్ల ఏపీ 17 వేల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డుల‌ను మాత్రమే కాదు వేలాది ఉద్యోగాలను కూడా కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

వైసిపి ప్ర‌భుత్వం దెబ్బ‌కి ఇప్పటికే ప్రాంక్లిన్ టెంపుల్ట‌న్‌, లులూ వంటి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి బైబై చెప్పేశాయ‌న్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా వుండగా విశాఖ‌లో సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వహించి వివిధ దశల్లో 52వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ గ్రూప్ తో ఎంవోయూ కుదుర్చుకున్నామ‌ని లోకేష్ గుర్తు చేశారు. 

READ MORE ముఖ్య‌మంత్రి గారూ! మీకు ఓటేయడమే వారి పాప‌మా? ఎందుకిలా చేస్తున్నారు..: జగన్ కు లోకేష్ ఘాటు లేఖ

ఐటీ ఎల‌క్ర్ట్రానిక్స్ మంత్రిగా తాను, శాఖాధికారులు రిల‌య‌న్స్‌ని ఒప్పించి తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో 17 వేల కోట్ల‌తో ఎలక్ట్రానిక్స్ తయారీ ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేలా అంబానీని ఒప్పించామ‌ని తెలిపారు. జియో ఫోన్లు,సెట్ టాప్ బాక్సులు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ ప‌రిశ్ర‌మ ద్వారా ఒకే చోట 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నామ‌న్నారు. ఇలా ఎంతో క‌ష్ట‌ప‌డి టిడిపి ప్ర‌భుత్వం తెచ్చిన రిల‌య‌న్స్ ప‌రిశ్ర‌మ భూములు వెన‌క్కిచ్చి మ‌రీ వెళ్లిపోతుంటే ఏపీ స‌ర్కారు ఏం చేస్తోంద‌ని లోకేష్ ప్ర‌శ్నించారు. 

 అమెరికాకి చెందిన ట్రైటాన్ కంపెనీ వేల కోట్ల‌తో ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామ‌ని చంద్ర‌బాబు సీఎంగా వున్న‌ప్పుడు ఎంవోయూ చేసుకుంద‌ని తెలిపారు. ఇప్పుడు అదే ట్రైటాన్ తెలంగాణ‌కి త‌ర‌లిపోవ‌డంపై ప్ర‌భుత్వం ఏం స‌మాధానం చెబుతుంద‌ని లోకేష్ నిల‌దీశారు.