ప్రభుత్వ సలహాదారులు రాజకీయాలు మాట్లాడొచ్చా?: ఏపీ హైకోర్టు ప్రశ్న


ఏపీ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ సలహాదారులు మీడియా సమావేశాల్లో రాజకీయాంశాలు మాట్లాడడంపై ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ సలహదారుల నియామకాలకు సంబంధించిన విధి విధానాలను తమ ముందుంచాలని ఆదేశించింది.  ఏపీ ఎస్ఈసీగా నీలం సహానీ నియామకంపై  విచారణ సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

How can advisors address political press meets, high court asks AP Government lns


అమరావతి:  ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, సలహాదారులు రాజకీయ అంశాలు మాట్లాడటమేంటని  ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల సొమ్మును లక్షల్లో జీతాలుగా తీసుకుంటూ మీడియాతో రాజకీయ అంశాలు మాట్లాడటం చట్టవ్యతిరేకం కాదా అని వ్యాఖ్యానించింది. ఏపీ ఎస్ఈసీ గా  నీలం సహానీ  నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై  గురువారం నాడు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, సలహాదారుల నియామక విధి విధానాలు, విధులకు సంబంధించిన వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఎస్‌ఈసీగా సహానీ నియామకంపై  విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. 

విచారణ సందర్భంగా వ్యాజ్యంలోని వివరాలు ప్రతివాదులు దాఖలు చేసిన కౌంటర్లలోని అంశాలు పరిశీలించిన తరువాత  నీలం సహానీ 2020 మార్చి 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారన్నారు. అదే  డిసెంబరు 22నే ఆమెను ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమించారని న్యాయమూర్తి గుర్తుచేశారు. 

2021 మార్చి 27న ఆమె ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. అంతకుముందే ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించి మార్చి 24న సీఎం, గవర్నర్‌కు పంపిన మూడు పేర్లలో నీలం సహానీ పేరు కూడా పంపించారని ఆయన ప్రస్తావించారు. ఎస్‌ఈసీగా  సహానీని మార్చి 28న ఆమె నియమితులయ్యారన్నారు. ప్రతీ శాఖకు ఓ మంత్రి ఉండగా ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సలహాదారులు సమీక్ష సమావేశాలు నిర్వహించవచ్చా అని ఆరా తీశారు. 

మీరు అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ సలహాదారులు మీడియాతో రాజకీయపరమైన అంశాలను మాట్లాడటం చూశారా? అని గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డిని  హైకోర్టు ప్రశ్నించింది. అప్పట్లో అలా జరగలేదని సీనియర్‌ న్యాయవాది సమాధానం ఇచ్చారు. 

సీఎం నిర్ణయం తీసుకొనే క్రమంలో ముఖ్య సలహాదారులు, సలహాదారులు సలహాలు ఇస్తారన్నారు. సలహాదారులకు ఇచ్చిన సబ్జెక్టులకు సంబంధించి వారు అధికారులతో సమీక్ష నిర్వహించవచ్చని చెప్పారు.ఈ విషయమై  న్యాయమూర్తి స్పందిస్తూ వ్యాజ్యంపై సరైన విచారణ జరగాలంటే సలహాదారుల నియామకం, వారి విధులను పరిశీలించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నీలం సహానీని  ఎస్‌ఈసీగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ విజయనగరం జిల్లా, సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎస్‌ఈసీ నియామకం ఉందన్నారు. స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 28న నీలం సహానీ  నియామకానికి సంబంధించి జారీచేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. గురువారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నారని విచారణను వాయిదా వేయాలని న్యాయవాది సాల్మన్‌ రాజు కోర్టును కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను 19కి వాయిదా వేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios