చంద్రబాబుకు రాజమండ్రి జైలులో భద్రత పెంచాం.. సింపతీ కోసమే టీడీపీ ప్రయత్నాలు: తానేటి వనిత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు జైలులో సెక్యూరిటీ ఉందని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. తాము ఇంకా అక్కడ భద్రతను పెంచడం జరిగిందని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు జైలులో సెక్యూరిటీ ఉందని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. తాము ఇంకా అక్కడ భద్రతను పెంచడం జరిగిందని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరోర బెటాయిలియన్‌లో మంగళవారం రోజున జరిగిన పోలీసు జాగిలాల శిక్షణ ముగింపు కార్యక్రమానికి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు భద్రతకు సంబంధించి టీడీపీ చేస్తున్న ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే స్పందించిన తానేటి వనిత.. చంద్రబాబు భద్రత పరంగా ఎలాంటి లోపాలు లేవని తెలిపారు. జైలులో స్నేహ బ్లాక్‌ను పూర్తిగా చంద్రబాబు కోసమే కేటాయించామని చెప్పారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని.. అందులో చూసుకుని చంద్రబాబు ఎవరినైతే లోపలికి అనుమతించమంటారో వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయితే టీడీపీ నేతలు ప్రతి చిన్న విషయంపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వంపై నిందలు వేసి సింపతీ పొందాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే టీడీపీ నేతలు ప్రయత్నాలు ఫలించడం లేదని అన్నారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఆయనను జైలులో కలిసివచ్చిన తర్వాత.. దోమలు ఉన్నాయని, వేడి నీళ్లు ఇవ్వడం లేదనే చిన్న చిన్న కారణాలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు ఒక వీఐపీ అని.. ఆ ప్రకారమే అక్కడ కావాల్సిన సౌకర్యాలు, భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆరోపణలతో ఆయనకు సంబంధం లేదని రుజువు చేసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని.. చంద్రబాబు మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తే ఇప్పటికే బెయిల్ వచ్చి ఉండేది కదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో తీవ్రత ఉండటం వల్లే ఆయనకు బెయిల్ రావడం లేదని అన్నారు.