అమరావతి: గురువారం విశాఖపట్నంలోని ఎల్.జి.పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైనదని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిని ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని... అయితే ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించిన తీరు యావత్ భారతదేశానికి ఆదర్శనీయంగా నిలిచిందన్నారు. విశాఖ ప్రజలు, యువత, పోలీస్ యంత్రాంగం, అధికారులు సకాలంలో స్పందించడం వలన దుర్ఘటనలో ఎక్కువమంది ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగారని హోంమంత్రి అభినందించారు.  

''కరోనా బాధ్యతల్లో పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నప్పటికీ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తీరు ప్రసంశనీయం. ముఖ్యమంత్రి  ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ప్రకటించిన దాఖలాలు లేవు. అదేవిధంగా తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు, అస్వస్థతకు లోనైన వారికి లక్ష రూపాయలు, ఐదు గ్రామాలకు చెందిన దాదాపు 15 వేల మందికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించడం నభూతోనభవిష్యత్తు'' అని అన్నారు. 

'' ప్రమాద భాదితులకు ఒక్క రోజులోనే 30 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సామాన్యమైన విషయం కాదు. గతంలో భాదితులకు నష్టపరిహారం ఎక్కువగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేసేవి. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారంపై విపక్షాలు కూడా మెచ్చుకుంటున్నాయి. గతంలో ప్రమాదలు జరిగినప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరును..నేడు జగన్ స్పందించిన తీరును ప్రజలందరూ గమనిస్తున్నారు'' అని పేర్కొన్నారు. 

''గతంలో జరిగిన ప్రమాదాలపై సమీక్షలు పెట్టి..నష్టపరిహారం ప్రకటించిన ఎప్పటికో భాదితులకు నగదు చేరేది. కానీ మన ప్రభత్వం ఒక్క రోజులోనే భాదితులకు తక్షణ సహాయం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. దుర్ఘటనలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయో మనం ఊహించలేము. కానీ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించిన తీరును ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది'' అని సూచించారు. 

''ఈ రోజు పోలీసులు, స్థానిక ప్రజలు, యువత, అధికారులు కనబరిచిన తీరును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ప్రమాదం లో గాయపడిన వారు ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స చేయించుకున్నప్పటికి..ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా  ప్రభుత్వమే చేసుకుంటోంది. ఈ సంఘటలో 443 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోని చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలను ప్రభ్యుత్వమే అండగా ఉంది. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయడానికి హై పవర్ కమిటీ ని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది'' అని వివరించారు. 

''ఇప్పటికే ఎల్.జి.పాలిమర్స్ కంపెనీ పై కేస్ కూడా నమోదయ్యింది. ప్రమాదానికి కారణమైన వారిని ప్రభత్వం తప్పక శిక్షిస్తుంది. లాక్ డౌన్ కారణంగా చాలా రోజులు పరిశ్రమలు మూతపడటం వలన ఇటువంటి సంఘటలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటలు జరిగాయి. తమిళనాడు, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కూడా ప్రమాదాలు జరిగాయి. లాక్ డౌన్ తరవాత ఎవరైనా కంపనీ లను తిరిగి ప్రారంభిస్తున్నప్పుడు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. హైపర్ కమిటీ దర్యాప్తు పూర్తయిన వెంటనే ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తప్పక తీసుకుంటాము'' అని హోంమంత్రి తెలిపారు.