అనంతపురం: స్నేహానికి ఆస్తి, అంతస్తు, హోదా ఇవేమీ అక్కర్లేదు అనేది జగమెరిగిన సత్యం. కల్మషం లేని స్నేహం ఎక్కడున్నా వారి మధ్య అనుబంధాన్ని పెంచేలా చేస్తుంది అంటూ వింటూనే ఉన్నాం అది నిజమని నిరూపించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. 

ఈ ఏడాది సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోరంట్ల మాధవ్ తొలిప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు. 

ఎంపీగా గెలిచిన అనంతరం తన పార్లమెంట్ నియోజకవర్గమైన కొడిమిలో పర్యటించేందుకు వెళ్లారు. కొడిమిలోని వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. 

ఇంతలో తనకు బందోబస్తు నిర్వహణ అధికారిగా తన స్నేహితుడు అనంతపురం రూరల్ సీఐ డి.మురళీధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. మురళీధర్ రెడ్డిని చూసిన ఎంపీ గోరంట్ల మాధవ్ రేయ్ రారా మురళీధర్ రెడ్డి అంటూ సీఐను పిలవడంతో సభ ఒక్కసారిగా నిశబ్ధం నెలకొంది. 

సీఐను రేయ్ రారా అంటూ మాట్లాడుతుండటంతో అంతా నివ్వెరపోయారు. సీఐ మురళీధర్ రెడ్డి దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. నా ప్రణ స్నేహితుడు నాకే బందోబస్తు నిర్వహించడం ఏంటి..? నా పక్కన కూర్చో అంటూ చెప్పుకొచ్చారు. 

తన ప్రాణ స్నేహితుడిని పరిచయం చేయడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. అనంతరం సభ అయ్యేవరకు సీఐ మురళీధర్ రెడ్డి గోరంట్ల మాధవ్ వెంటే ఉన్నారు. విధినిర్వహణకు ప్రాధాన్యతను ఇస్తూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించే మురళీ లాంటి అధికారి మన జిల్లాకు లభించడం అదృష్టమని కొనియాడారు. 

మురళీ మంచి మేధావి అని అయితే కొస్తలో ఉన్నత ఉద్యోగాలు దూరమయ్యాని చెప్పుకొచ్చారు.1998లో పోస్టింగ్ లభించినప్పుడు నుంచి ఇప్పటి వరకు తమ స్నేహ బంధం ఇలాగే కొనసాగుతుందని కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ మాధవ్ తెలిపారు. 

ఎంపీ గోరంట్ల మాధవ్ తన స్నేహితుడుని ఆప్యాయంగా పలకరించడం, హోదా మరిచి తన పక్కనే కూర్చోబెట్టుకుని అత్యంత గౌరవించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమయ్యింది. స్నేహానికి విలువ ఇచ్చే గొప్ప వ్యక్తి ఎంపీ గోరంట్ల మాధవ్ అంటూ కొందరు కొనియాడారు.