సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చలో సీఎంవో పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా బలగాలను ఉంచారు.
సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చలో సీఎంవో పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా బలగాలను ఉంచారు. పొట్టిపాడు, దావులూరు, కాజా చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గ వారధి, తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా నిఘా పెట్టారు.
విజయవాడలో హోటళ్లు, లాడ్జిలు, రైల్వేస్టేషన్, బస్టాండ్లలో తనిఖీలు చేపడుతున్నారు. సమీప రైల్వే స్టేషన్‌లలో కూడా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. గుర్తింపు కార్డులు పరిశీలించాకే విజయవాడలోకి అనుమతిస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని దారులు మూసివేశారు. పరిసర ప్రాంతాల్లో దారికి అడ్డంగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయం మార్గంలో నివాసం ఉండే స్థానికులనూ ఇళ్లకు పంపకపోవడంతో.. కొన్నిచోట్ల స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలోనే విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బందోబస్తును దాటుకుని సీఎంవో ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు విజయవాడ నగరవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక, యూటీఎఫ్ చలో సీఎంవో పిలపు నేపథ్యంలో.. తాడెపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎవరూ అడుగుపెట్టకుండా పోలీసులు మొత్తం 5 అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 52 చోట్ల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిలువరిచేందుకు 1000 మంది పోలీసులను ఉపయోగిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పోలీసులతో పాటు ఇతర జిల్లా పోలీసులను తాడెపల్లిగూడెంకు రప్పించుకున్నారు. సివిల్,ఏఆర్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక బలగాలకు అక్కడ విధులు కేటాయించారు.
ఈ ముట్టడిని భగ్నం చేసేందుకు ఆదివారం నాటి నుంచే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మఫ్టీలో తిరుగుతూ వాహనాలు చెక్ చేస్తూ అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగానే నిరసనకారులను, ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉన్న వారిని గుర్తించి సమీపంలోని పోలీసు స్టేషన్ లకు తీసుకెళ్లారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. క్యాంపు ఆఫీసు వైపు ముట్టడి కోసం తరలివస్తున్న వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేస్తున్నారు.
చలో సీఎంవోకు అనుమతి లేదు: విజయవాడ సీపీ
సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. విజయవాడలో 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్‌పీసీ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. ఈ ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
