ఆయేషా మీరా కేసులో దారుణమైన ట్విస్ట్
: ఆయేషా మీరా హత్య కేసు విషయమై శుక్రవారం నాడు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
హైదరాబాద్: ఆయేషా మీరా హత్య కేసు విషయమై శుక్రవారం నాడు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన కీలక రికార్డులు ధ్వంసమైన నేపథ్యంలో స్థానిక పోలీసుల కంటే సీబీఐ విచారణ చేయడం మేలని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చింది. ఆయేషా మీరా కేసులో రికార్డుల ధ్వంసం విషయమై 4 వారాల్లో నివేదిక సమర్పించాలని కోర్టు రిజిస్టార్ జనరల్ను ఆదేశించింది.
బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడకు సమీపంలోని ఓ హస్టల్‌లో హత్యకు గురైంది.ఈ ఘటన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. 2007 డిసెంబర్ 27వ తేదీన ఆయేషా మీరా ఇబ్రహీంపట్నంలోని లేడీస్ హస్టల్‌లో ఉంటూ బీ ఫార్మసీ చదువుతోంది.
హస్టల్‌లో ఉన్న ఆయేషామీరా అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఈ కేసులో అప్పుటి పోలీసులు అరెస్ట్ చేసిన సత్యం బాబును హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించింది.ఈ కేసును తిరిగి విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో 2017 ఏప్రిల్ 2వ తేదీన సత్యం బాబు జైలు నుండి విడుదలయ్యారు.
అయితే ఆయేషా మీరా హత్య జరిగిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రె్డ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటనను ఆనాడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయేషా మీరా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
2014లో చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ కేసులో అరెస్టైన సత్యంబాబు కూడ నిర్ధోషిగా విడుదల కావడంతో ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ కేసును సిట్ విచారణ ప్రారంభించింది.
ఈ తరుణంలోనే కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ గుర్తించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు సిట్ తెలిపింది. దీంతో ఆయేషా మీరా కేసులో రికార్డుల ధ్వంసంపై హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
రికార్డుల ధ్వంసంపై విచారణకు హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీచేసింది. రికార్డుల ధ్వంసంపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్టార్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.ఈ కేసు విచారణలో స్థానిక పోలీసుల కంటే సీబీఐ మేలని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విషయంలో సీబీఐను ప్రతివాదిగా హైకోర్టు చేర్చింది..