అమరావతి: ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, శాసనభ పక్షం ఉప నేత అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ మీద సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. 

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 29వ తేదీన హైకోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణపై ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కొంత కాలం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఆయనను జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో ఆయనను చికిత్స నిమిత్తం రమేష్ ఆస్పత్రికి తరలించారు. 

ఈఎస్ఐ ఆస్పత్రులకు సంబంధించిన మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం విజిలెన్స్ అండే ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్ల ద్వారా ఆర్డర్లు ఇచ్చినట్లు బయటపడింది. దీంతో విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.