అమరావతి:  యువతి లైంగిక వేధింపులకు గురైన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న తేదీని పరిగణనలోకి తీసుకుని ఆమెను మేజర్ గా పరిగణనలోకి తీసుకుని ఫోక్సో చట్టం వర్తించదని చెప్పడం సరికాదని స్పష్టం చేసింది. నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో హైకోర్టు ఆ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 

బాధితురాలు ఆత్మహత్య చేసుకునే నాటికి మేజర్ గా ఉన్నందను నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి, దాఖలు చేసిన చార్జిషీట్ ను పోక్సో ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.  చార్జిషీట్ ను తిప్పి పంపుతూ సంబంధిత కోర్టులో దాఖలు చేసుకోవాలని పోక్సో కోర్టు జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఆ చార్జిషీట్ ను తిరిగి స్వీకరించి, సంబంధిత సాక్ష్యాధారాల ఆధారంగా కేసును ఆరు నెలల్లోగా తేల్చాలని న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. 

వరంగల్ కు చెందిన రిషితేశ్వరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్టర్ కోర్టు మొదటి సంవత్సరం చదువుతుండగా లైంగిక దాడి, వేధింపులు, ర్యాగింగ్ తదితర కారణాలతో 2015 జులై 14వ తేదీన హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రిషితేశ్వరి సీనియర్లు అయిన నాగలక్ష్మి, చరణ్ నాయక్, ఎన్. శ్రీనివాస్, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావులపై ఐపీసీ, ర్యాగింగ్ చట్టాలతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత పోక్సో ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 

పోక్సో కోర్టు 2016 జనవరి 7వ తేదీన విచారణ చేపట్టింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకునే సమయానికి మేజర్ అని, అందువల్ల పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం సరికాదని , చార్జిషీట్ ను సంబంధిత కోర్టులో దాఖలు చేయాలని పోక్సో ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మృతురాలి తండ్రి 2017లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థితిలో హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేస్తూ పోక్సో చట్టం కింద విచారణ జరపాలని ఆదేశించింది.