భీమవరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సినీనటుడు సుమన్. జగన్ కేబినెట్ అద్భుతమని హీరో సుమన్ కొనియాడారు. కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సమన్వయం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు రావడం అభినందనించదగ్గ విషయమన్నారు. 

వైయస్ జగన్ ఎన్నో కష్టాలుపడి ముఖ్యమంత్రి అయ్యారని స్పష్టం చేశారు. మరోవైపు మహిళలకు జగన్ తన కేబినెట్ లో కీలక స్థానాలు కట్టబెట్టడడం శుభపరిణామమన్నారు. జగన్ కేబినెట్ లో ఒక మహిళకు డిప్యూటీ సీఎం, మరో మహిళా ఎమ్మెల్యేకు హోంమంత్రిత్వ శాఖ కట్టబెట్టం జగన్ కే చెల్లిందన్నారు. 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుమన్ కోరారు. అన్ని రంగాలను సమన్వయం చేస్తున్న సీఎం జగన్  సినీ ఇండస్ట్రీపై కూడా దృష్టిపెట్టాలని కోరారు. సినీ ఇండస్ట్రీని ఏపీకి తీసుకొచ్చి అన్నివిధాల ఆదుకోవాలని కోరారు. 

జగన్ చేపట్టిన కార్యక్రమాలు కేబినెట్ నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తే వచ్చే ఐదేళ్లు కూడా సీఎం వైఎస్‌ జగన్‌నేని చెప్పుకొచ్చారు.  

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమిపాలవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారణమని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని హీరో సుమన్ అభిప్రాయపడ్డారు.