విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరో 12గంటల్లో  తీవ్రవాయుగుండంగా బలపడనుందని... ఇది పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి మంగళవారం ఉదయం నర్సాపురం-విశాఖపట్నం మధ్య కాకినాడ దగ్గరలో తీరందాటే అవకాశంవుందని ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యింది. 

అదేవిధంగా ఉత్తర అండమాన్ సముద్రంలో  బుధవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని... వీటి ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల  భారీ  వర్షాలు, 
కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అకశాలున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియగా మిగిలిన చోట్ల విస్తారంగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశలున్నట్లు వెల్లడించారు. 

మంగళవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి తీవ్ర భారీవర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలినచోట్ల విస్తారంగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం వందని వెల్లడించారు. ఇక వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని...సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు. కాబట్టి  మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని... లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

ఎప్పటికప్పుడు వాయుగుండం స్థితిని పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని... తీరప్రాంతాల అధికారులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.