Asianet News TeluguAsianet News Telugu

గులాబ్ తుఫాన్: రెండు రోజులు ఆంధ్రలో భారీ వర్షాలు.. తుఫాన్ హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రేపటికల్లా తీవ్ర తుఫాన్‌గా మారనుంది. దీంతో రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాన్‌ను గులాబ్ తుఫాన్‌గా వ్యవహరిస్తున్నారు.
 

heavy rains expected in AP as dippression to turn into cyclone in bay of bengal
Author
Amaravati, First Published Sep 25, 2021, 1:55 PM IST

అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్‌‌గా పరిణమించనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాన్‌కు గులాబ్ తుఫాన్‌ పేరుపెట్టారు. ఇది రేపటికల్లా తీవ్రరూపం దాలుస్తుందని వివరించింది. ఈ తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఉత్తరతీరంలో ఈ రోజు రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రతోపాటు ఒడిశాలో ఈ తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉంటుందని వెల్లడించింది. వీటితోపాటు తెలంగాణ, చత్తీస్‌గడ్‌లలోనూ అక్కడక్కడ వర్షాలు పడుతాయని వివరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోనూ గులాబ్ తుఫాన్ ప్రభావముందని చెప్పడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో తలమునకలయ్యారు.

 

ఆంధ్రప్రదేశ్ ఉత్తరతీర జిల్లాలు, ఒడిశా దక్షిణాది ప్రాంతాలకు ఐఎండీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపిన వాతావరణ శాఖ మరో 12 గంటల్లో ఇది తుఫాన్‌గా పరిణమిస్తుందని ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో వెల్లడించింది. 

తుఫాన్ సమయంలో తీరంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ రోజు సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం సాయంత్రానికల్లా తుఫాన్ మళ్లీ అల్పపీడనంగా మారిపోతుందని తెలిపింది. ఒడిశా, ఆంధ్ర తీరానికి 500 కిలోమీర్లకు అధికదూరంలోనే బంగాళాఖాతంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో తుఫాన్ పశ్చిమం, నైరుతి వైపు ప్రయాణించే అవకాశముందని, అప్పుడే దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది. విశాఖపట్నం, గోపాల్‌పుర్, కళింగపట్నాలలో ఆదివారం తుఫాన్ తీరం దాటే అవకాశముందని వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios