అమరావతి: ఒడిషా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని...ఇది రాత్రికి ఉత్తర ఛత్తీస్ గఢ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావనణ కేంద్రం తెలిపింది.  దీనికి అనుబంధంగా 5.8కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని...అలాగే మధ్య తమిళనాడు పరిసరాల్లో 7.6కి.మీ. ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. వీటి ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయన్నారు.  

అంతేకాకుండా వీటి ప్రభావంతోనే సోమవారం ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇలా విజయనగరంలో 123, నెల్లిమర్ల 60, వంగరలో 58 మి.మీ భారీ వర్షపాతం నమోదైందన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర, యానాంలలో భారీవర్షాలు కురుస్తాయని, రాయలసీమలోనూ అక్కడక్కడ భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. 

రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని  అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కాబట్టి ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. మత్స్యకారులు మరింత జాగ్రత్తగా వుండాలని సూచించారు. 

గతకొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని నీటిపారుదల రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. అలాగే వాగులు, వంకలు, చెరువులు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.