భారీ వర్షాలతో గోదావరిలోని ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరడంతో.. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

భారీ వర్షాలతో గోదావరిలోని ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరడంతో.. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన 48 గేట్లను విజయవంతంగా ఆపరేట్ చేస్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే స్పిల్ వే చానల్ ద్వారా 15లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా దిగువకు విడుదల చేశారు.

అయితే పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ స్పిల్ వేలోని ప్రధానమైన పనులన్నీ పూర్తయ్యాయి. గేట్లను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో అందులోనూ హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. మొత్తం 48 గేట్లన్ని ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరద నీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్ల పాత్ర కీలకంగా మారింది.

ఇక, గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి. 100 ఏళ్లలో ఇంతటి స్థాయిలో వరద రావడంత ఇదే మొదటి అని అధికారులు చెబుతున్నారు. అయితే వరద నియంత్రణకు ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు.. స్పిల్ వే నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పిల్ వే లో గతేడాది వరదల సమయానికే 48గేట్లకు గానూ 42రేడియల్ గేట్లు అమర్చడంతో పాటు,వాటిని ఎత్తడానికి అవసరమైన 84హైడ్రాలిక్ సిలిండర్లనూ అమర్చారు. అదేవిధంగా 24పవర్ ప్యాక్ సెట్లను సైతం స్పిల్ వే పై అమర్చి గేట్లను ఆపరేట్ చేశారు.

ఇక, పోలవరం ప్రాజెక్టు లో రేడియల్ గేట్లతో పాటు డెడ్ స్టోరేజి లెవల్ లో రివర్ స్లూయిజ్ గేట్లు ఉంటాయి. మొత్తం 10 రివర్ స్లూయిజ్ గేట్లు.. వాటికి ఒక్కో గేటుకు రెండు చొప్పున 20హైడ్రాలిక్ సిలిండర్లు,వాటిని ఆపరేట్ చేయడానికి 10 పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి. స్పిల్ వే దగ్గరకు వచ్చిన వరదను ముందుగా రివర్ స్లూయిజ్ గేట్ ద్వారానే విడుదల చేస్తారు. వీటిని గతేడాదే అమర్చి ముందుగా వచ్చిన వరదను ఈగేట్ల ద్వారానే విడుదల చేశారు.రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజి ఉన్న సమయంలో గోదావరి డెల్టాకు త్రాగు,సాగునీరు అందించడానికి ఈగేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు.

ఇక, వందేళ్ళలో గోదావరికి 36లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశారని ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్ తెలిపింది. ఒక్కో రేడియల్ గేటు 16మీ వెడల్పు, 20మీ పొడవు, 300మెట్రిక్ టన్నుల బరువు తో రోజుకు 432 టీఎంసీల వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్ద్యంతో డిజైన్ చేశారని చెప్పింది.