Asianet News TeluguAsianet News Telugu

Andhra Pradesh Intermediate topper : శభాష్ తల్లీ... బాల్య వివాహాన్ని ఎదిరించి భలే ర్యాంక్ సాధించావ్...

హృదయాన్ని కదిలిందే స్టోరీ ఈ ఇంటర్మీడియట్ టాపర్ ది. పేదరికాన్ని జయించి, బాల్య వివాహాన్ని ఎదిరించి, ప్రభుత్వ కాలేజీలో చదివిన కర్నూల్ యువతి ఇంటర్ లో టాప్ మార్కులు సాధించింది. ఆమె చదువు ఎన్ని కష్టాల మధ్య సాగిందంటే... 

Heart warming tale of Kurnool girl who secured top marks in Intermediate Exams AKP
Author
First Published Apr 13, 2024, 12:31 PM IST

కర్నూల్ : చదువు విలువేంటో ఆమెకు  తెలుసు. తన కాళ్లపై తాను నిలబడాలంటే చదువొక్కటే మార్గమని గుర్తించింది. అందుకు తగ్గట్లుగానే బాగా చదివేది. కానీ ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం చాలామంది పేరెంట్స్ లాగే కూతుర్ని భారంగా భావించారో ఏమోగానీ చదువు మాన్పించి పెళ్లి చేయడానికి సిద్దమయ్యారు. కానీ బాల్య వివాహాన్ని ధైర్యంగా ఎదిరించిన బాలిక చదువు కొనసాగించింది.ఇలా ఎన్నోసవాళ్ల మధ్య చదువుకుంటున్న ఆ బాలిక తాజాగా వెలువడ్డ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది.  ఇలా చదువుల సరస్వతిగా నిలిచి మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచింది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఈ బాలిక.

కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి చెందిన నిర్మల చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకు. చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే... కుటుంబంలోనూ చదువుకున్నవారు ఎవరూ లేరు... అయితేనేం   ఎంతో పట్టుదలతో చదువుతున్న ఆమె ఇటీవల వెలువడిన ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది. ఆలూరు కేజిబివిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న నిర్మల అత్యధిక మార్కులు సాధించింది. బైపిసిలో మొత్తం 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. ప్రభుత్వ అండతో చదువుకుంటున్న ఆమె మంచి మార్కులు సాధించింది... దీంతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నిర్మలకు అభినందనలు తెలిపారు. 

బాల్య వివాహం నుండి తప్పించుకుని టాపర్ గా  :

నిర్మలది నిరుపేద కుటుంబం. నలుగురు అక్కాచెల్లెల్లలో ఈమె చివరిది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేసారు. ఇలాగే నిర్మలకు కూడా పెళ్లి చేయాలని భావించారు.

అయితే నిర్మలకు మాత్రం పెద్ద చదువులు చదవాలని కోరిక వుండేది. దీంతో గతేడాది ఎంతో కష్టపడి చదివి పదో తరగతి పరీక్షలో 600 మార్కులకు గాను 537 మార్కులు (89.5 శాతం) సాధించింది. దీంతో ఆమెను స్కూల్ టీచర్స్, తోటి విద్యార్థులు, తెలిసినవారు అభినందించారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఆమె సాధించిన మార్కులు అంతగా ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఈ మార్కులు తమ బిడ్డ పెళ్లికి అడ్డంకిగా మారతాయని భావించారు. 

పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన నిర్మలను ఇంటర్మీడియట్ చదివించేందుకు తల్లిదండ్రులు సాకులు వెతుక్కున్నారు. పెద్ద చదువులు వద్దని... ఇక్కడితో చదువు మానేయాలని నిర్మలను ఒప్పించే ప్రయత్నం చేసారు. అయినా దగ్గర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు... కాబట్టి చదువు కొనసాగించడం సాధ్యంకాదని సూచించారు. కాబట్టి తాము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసారు. పెళ్లి వయసు కాకున్నా ఆమెను బాల్య వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్దమయ్యారు. 

అయితే చదువుకోవాలన్న నిర్మల ధైర్యంగా ముందుకు అడుగువేసింది. తన బాల్యవివాహం గురించి స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఫిర్యాదుచేసిన నిర్మల చదువుకోవాలన్న కోరికను అతడి చెప్పింది. దీంతో వెంటనే ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించడంతో ముందుగా   బాలిక తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. వారిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా నిర్మల పైచదువులకు ఒప్పుకున్నారు. దీంతో ఆలూరులోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపిసిలో చేరింది నిర్మల. 

ఎన్నో అడ్డంకులను దాటుకుని చదువుకునే అవకాశం వచ్చింది...  కాబట్టి ఇంటర్మీడియట్ లోనూ ఎంతో శ్రద్దగా చదివింది నిర్మల. ప్రతిరోజూ కాలేజీకి వెళుతూ అద్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్దగా వినడం... హాస్టల్లోనూ చదువుకోవడమే ఆమె పనిగా పెట్టుకుంది. ఇలా కష్టపడి చదివిన ఆమె ఇంటర్మీడియట్ పరీక్షలు చాలాబాగా రాసింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మంచి మార్కులు సాధించి సెకండ్ ఇయర్ లో అడుగుపెడుతోంది. 

నిర్మల లక్ష్యం ఇదేనట : 

బాగా చదివి ఐపిఎస్ ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యమని నిర్మల తెలిపారు. తనలాగ ఎందరో అమ్మాయిలు తల్లిదండ్రుల ఆర్థిక కష్టాల కారణంగా చదువుకోలేకపోతున్నారని... చిన్న వయసులోనే పెళ్లిల్లు చేసుకోవాల్సి వస్తోందన్నారు. కాబట్టి పోలీస్ ఆఫీసర్ గా బాల్య వివాహాలను అరికడతానని... అమ్మాయిలు తమ కలలు నిజం చేసుకునేందుకు సహకరిస్తానని నిర్మల తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios