Asianet News TeluguAsianet News Telugu

వైద్యశాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్... మిగతా సిబ్బందికీ పరీక్షలు

మంగళగిరి  ఆటోనగర్ లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి కరోనా బారిన పడటం కలకలం రేపింది. 

health department office driver infected with coronavirus
Author
Guntur, First Published Apr 28, 2020, 10:36 AM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ లోని వైద్య శాఖ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఇక్కడ పనిచేసే డ్రైవర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో భయాందోళన మొదలయ్యింది. డ్రైవర్ ద్వారా తమకెక్కడ కరోనా వ్యాప్తి చెందిందో అన్న అనుమానం ఆ కార్యలయంలో పనిచేసే ప్రతిఒక్క ఉద్యోగిలో మొదలయ్యింది. 

ఈ క్రమంలో గుంటూరు జిల్లా వైద్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యాలయ సిబ్బందికి  కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఉద్యోగులందరికీ కరోనా నెగెటివ్  రిపోర్టు వచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కృష్ణాజిల్లా వైద్య యంత్రాంగానికి అప్పగించి, విజయవాడలోని ప్రత్యేక వార్డులో ఉంచారు. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచి ఆరోగ్య పరిస్థితినిఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. మంగళగిరి ఆటోనగర్ లోని సదరు కార్యాలయాన్ని మూసివేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సోమవారం 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 235 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మరణించారు. 

24 గంటల్లోనే గుంటూరు జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 33, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం ఒక కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసుల నమోదులో 292 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 237 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, కృష్ణా జిల్లాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి చేరుకుంది. కొత్తగా అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో సంఖ్య 4కు చేరకుంది.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios