విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఎంతో చరిత్ర కలిగిన రామతీర్థంలోని కోదండ రామస్వామి ఆలయంలో రాములవారి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రామయ్య విగ్రహ శిరస్సు భాగం రామ కొలనులో లభ్యమైంది. దీని కోసం నిన్నటి నుంచి పోలీసులు, అధికారులు కొలనులో విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు రాములవారి విగ్రహ పున: ప్రతిష్టకు అధికారులు, గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కాగా, ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు.

మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాల కోసం అర్చకుడు వెళ్లేసరికి ఆలయ తలుపులకు తాళం లేదు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పూజారి అధికారులకు సమాచారం అందించారు.

దీంతో వారు పోలీసులకు తెలిపారు. అందరూ కలసి ఆలయం లోపల పరిశీలించగా శ్రీరామచంద్రస్వామి విగ్రహం తల తెగి వుంది. వెంటనే శిరస్సు భాగం కోసం ఆలయ పరిసరాల్లో వెతికినా ఎక్కడా దొరకలేదు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ ప్రతినిధులు ఆధారాల సేకరణ ప్రారంభించారు.