తన ధ్యాసంతా తండ్రి గారిని సురక్షితంగా గమ్యానికి చేర్చడం మీదనే. రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి’ అంటూ హెచ్‌ జే దొర తన ఆటోబయోగ్రఫీలో హరికృష్ణ గురించి రాసుకొచ్చారు.

నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం నందమూరి అభిమానులను, కుటుంబసభ్యులు, బంధువులను కలచివేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆయన మృతి చెందారు. ఆయన తుదిశ్వాస విడిచి గంటలు గడుస్తున్నా.. ఆ షాక్ నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేదు. తండ్రి కోసం చైతన్య రథాన్ని అవలీలగా నడిపిన ఆయన.. ఇప్పుడు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ సందర్బంగా మాజీ డీజీపీ హెచ్‌ జే దొర ఆటోబయోగ్రఫీ ‘ఎన్టీఆర్‌తో నేను’ పుస్తకంలో హరికృష్ణ గురించి ఆయన రాసిన మాటలను గుర్తు చేస్తూ..

‘ఎన్టీఆర్‌తో నేను’ పుస్తకంలో హరికృష్ణకు సంబంధించి ఇలా రాశారు...
‘తెలంగాణ వీధుల మీదుగా బయల్దేరిన ఎన్టీఆర్‌ చైతన్య రథం రాయలసీమ రాదారుల్లో తిరిగి తిరిగి అక్కడి నుంచి ఆంధ్రా వైపు మళ్లి చివరిగా ఉత్తరాంధ్రలో రెస్ట్‌ తీసుకుంది. ఇక్కడో విషయం తప్పకుండా ప్రస్తావించి తీరాలి. హనుమంతుడి గురించి చెబితే కాని రామకథ సంపూర్ణం కాదన్నట్టు ఎన్టీఆర్‌ వేల కిలోమీటర్ల ప్రయాణాలకి సారథ్యం వహించిన ఆయన కుమారుడు హరికృష్ణ గురించి ఇక్కడ చెప్పే తీరాలి. ఆ టూర్లలో నేనతన్ని చాలా నిశితంగా పరిశీలించేవాణ్ణి. ఎంతసేపూ అతని దృష్టి వాహనం నడపడం పైనే.. పగలల్లా తండ్రి గారు అధిరోహించిన రథాన్ని పరుగులు తీయించడం, రాత్రి ఆయన విశ్రమించాక మెకానిక్‌లతో కూర్చుని వ్యాన్‌కు అవసరమైన మరమ్మతులు చేయించడం... ఇదీ ఆయన దినచర్య. ఇందులో ఏనాడూ పెద్ద మార్పేదీ ఉండేది కాదు. నాన్నగారు ప్లస్‌ వ్యాన్‌ మినహా హరికృష్ణకి మరింకేదీ పట్టేది కాదు. ఎక్కడికి వెళ్తున్నారో, ఏ నియోజకవర్గంలో ఎవరి ప్రచారానికి వెళ్తున్నారో.. ఇవేమీ బొత్తిగా తెలియవతనికి. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే తన ధ్యాసంతా తండ్రి గారిని సురక్షితంగా గమ్యానికి చేర్చడం మీదనే. రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి’ అంటూ హెచ్‌ జే దొర తన ఆటోబయోగ్రఫీలో హరికృష్ణ గురించి రాసుకొచ్చారు.