ఇప్పటికే ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట వెంట ఉన్న ప్రజావేదిక అక్రమ కట్టడమని కూల్చివేసిన జగన్ ప్రభుత్వం.. ఆ పక్కనే ఉన్న భవంతులకు నోటీసులు ఇచ్చింది. దీంతో జగన్ తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. విశాఖలోని టీడీపీ కార్యాలయం అక్రమ నిర్మాణమంటూ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకట రమణను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తమ ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని వెల్లడించారు.

అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందజేసి.. తదుపరి చర్యలు తీసుకుంటామని రమణ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక నుంచే ప్రారంభించామని మోపిదేవి గుర్తు చేశారు.