మోడీ పర్యటన ఏపీ బీజేపీకి బూస్ట్ ఇచ్చిందన్నారు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రధాని మోడీ సోమువీర్రాజు పేరును అడిగి తెలుసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైనా నరసింహారావు స్పందించారు.
బీజేపీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎవరికి లబ్ధి చేకూర్చాలని ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని ప్రధాని సూచించారని జీవీఎల్ పేర్కొన్నారు. మోడీ పర్యటన ఏపీ బీజేపీకి బూస్ట్ ఇచ్చిందన్నారు . విశాఖలో ఇంటర్నెట్ ఎక్చేంజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. వచ్చే ఏడాది జనవరిలో ఇది ఏర్పాటవుతుందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
ఇంటర్నెట్ ఎక్చేంజ్ వల్ల ఇంటర్నెట్ వేగం, నాణ్యత పెరిగి ఛార్జీలు తగ్గే అవకాశం వుందన్నారు. ఐటీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ సర్వీసెస్‌కు మరింత ఊతం లభిస్తుందని.. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కూడా జరుగుతుందని జీవీఎల్ పేర్కొన్నారు. మరోవైపు.. ప్రధాని మోడీ సోమువీర్రాజు పేరును అడిగి తెలుసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైనా నరసింహారావు స్పందించారు. దీనిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. ఏపీ బీజేపీ నేతలందరినీ ఒక్కొక్కరిగా పేర్లు పరిచయం చేసుకోవాలని మోడీ కోరడం వల్లే వీర్రాజు తన పేరు నుంచి పరిచయం చేసుకోవడం ప్రారంభించారని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
Also Read:ఎకనామిక్ కారిడార్ ప్రారంభం ఏపీ తీర ప్రాంతాల అభివృద్ధికి నాంది... : ప్రధాని మోడీ
అంతకుముందు నిన్న విశాఖపట్నంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ... ఎకనామిక్ కారిడార్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఓడరేవులను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీతో అనుబంధించబడిన అనంతమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి తమ ప్రభుత్వం ఎలా ప్రయత్నాలు చేస్తున్నదనే విషయాలను ఏపీ ఎకనామిక్ కారిడార్ ప్రారంభం కార్యక్రమంలో ప్రధాని మోడీ వివరించారు. "ఈ రోజు, దేశం బ్లూ ఎకానమీతో ముడిపడి ఉన్న అనంతమైన అవకాశాలను గ్రహించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది... పోర్ట్ ఆధారిత అభివృద్ధి ద్వారా భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థలో మేము గొప్ప అవకాశాలను మెరుగుపరిచాము" అని భారీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మోడీ అన్నారు.
అలాగే, "ఈ రోజు ప్రారంభించబడుతున్న ఆర్థిక కారిడార్, ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్యం-తయారీని పెంచడానికి మల్టీమోడల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది... ఈ కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు ఇప్పుడు వేగవంతమైన అభివృద్ధిని పొందుతాయి" అని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయిందని, అయితే సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశం అభివృద్ధి పరంగా కొత్త మైలురాయిని సాధించగలిగినందున భారతదేశం మరింత ముందుకు సాగుతుందని ప్రధాని సూచించారు.
