గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మృతి: పోలీసుల అదుపులో ఉయ్యూరు శ్రీనివాస్
ఉయ్యూరు పౌండేషన్ కు చెందిన ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ఉయ్యూరు శ్రీనివాస్ పై పోలీసులు ఏ1 గా కేసు నమోదు చేశారు.
విజయవాడ: ఉయ్యూరు పౌండేషన్ కు చెందిన ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు సోమవారంనాడు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నాడు గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉయ్యూరు పౌండేషన్ ఆధ్వర్యంలో జనతా వస్త్రాల పంపిణీని చేపట్టారు. జనతా వస్త్రాల పంపిణీ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట సందర్భంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు మహిళలు గాయపడ్డారు. గాయపడిన వారిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. విజయవాడలోని ఓ హోటల్ లో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు ఇవాళ మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు సదాశివనగర్ లో నిన్న చంద్రన్న సంక్రాంతి కిట్ , జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఉయ్యూరు పౌండేషన్ చేపట్టింది. సంక్రాంతి కిట్ కోసం వచ్చిన వారికి ట్ోకెన్లు అందించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన తర్వాత సంక్రాంతి కిట్స్ పంపిణీని ప్రారంభించారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో గాయపడిన ముగ్గురు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత ఏడాది డిసెంబర్ 28న కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షో లో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. ఇరుకు సందులో రోడ్ షో నిర్వహించడం వల్ల తొక్కిసలాట జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తన సభలకు ఎక్కువ మంది జనం వచ్చారని చూపించుకొనే ప్రయత్నంలో భాగంగా ఇరుకు సందులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారని వైసీపీ విమర్శలు చేసింది.
also read:గుంటూరు ఘటన సభ నిర్వాహకుల వైఫల్యమే.. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదు: సోము వీర్రాజు
నిన్న గుంటూరులో నిర్వహించిన కార్యక్రమానికి టీడీపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉయ్యూరు పౌండేషన్ ద్వారా శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆ పార్టీ నేతలు చెప్పారు.. ఉయ్యూరు పౌండేషన్ అనుమతి తీసుకొనే సమయంలో పోలీసులకు ఇచ్చిన సమాచారానికి భిన్నంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.