గుంటూరులో అమానుషం... మహిళను వస్త్రాలు పట్టుకుని లాక్కెళ్ళిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)
ఆమె ఏ తప్పు చేసిందో తెలీదు... కానీ మహిళ అన్న కనీస జాలి చూపకుండా నడిరోడ్డుపైనే సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడిన ఘటన గుంటూరు మిర్చీ యార్డులో చోటుచేసుకుంది.
గుంటూరు : మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినా... వారి రక్షణకు దిశ, నిర్భయ వంటి చట్టాలు చేసినా... మహిళా సాధికారత అంటూ ప్రభుత్వాలు పెద్దపెద్ద మాటలు ఆడినా... మహిళలపై మగాడి జులుం మాత్రం కొనసాగుతూనే వుంది. ఈ ఆధునిక యుగంలో ఆడబిడ్డలు అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారు... అయినా వారి పరిస్థితి మారడం లేదు. వారిపై అఘాయిత్యాలు, అరాచకాలు కొనసాగుతూనే వున్నాయి. చివరకు రక్షణ కల్పించాల్సిన వారే మహిళలపై దాడులకు పాల్పడితే వారికి దిక్కెవరు. ఇలాంటి అమానుష ఘటనే ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూసింది.
గుంటూరు మిర్చీ యార్డు సెక్యూరిటీ సిబ్బంది ఓ మహిళతో దారుణంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఏ తప్పు చేసిందో తెలీదుగానీ సెక్యూరిటీ సిబ్బంది అందరిముందే అమానుషంగా వ్యవహరించారు. ఆమెరు పట్టుకుని కులం పేరుతో దూషిస్తూ రోడ్డుపైనే లాఠీతో చితకబాదారు. ఆమె ఎంత వేడుకున్నా కనికరం చూపించకుండా దాడికి పాల్పడ్డారు.
దాడితో ఆగకుండా మహిళ వస్త్రాలు పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లారు సెక్యూరిటీ సిబ్బంది. ఇలా పక్కకు తీసుకెళ్లి ఆమె చెంపలపై, ఒంటిపై ఎక్కడపడితే అక్కడ కొట్టారు. ఇలా ఆ మహిళతో చాలా దారుణంగా ప్రవర్తించారు గుంటూరు మిర్చీయార్డ్ సెక్యూరిటీ సిబ్బంది.
Read More అంబేద్కర్ విగ్రహంపై లోదుస్తులు వేసి అవమానం... సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దారుణం (వీడియో)
వీడియో
మిర్చీ యార్డులో ఓ షాప్ విషయంలో గొడవే మహిళపై దాడికి కారణమని తెలుస్తోంది. బాధితురాలిది ఎస్టీ సామాజికవర్గంగా తెలుస్తోంది. ఏదేమైనా సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్ చేస్తూ అణగారిని వర్గాలకు చెందిన మహిళతో దురుసుగా ప్రవర్తించడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. మహిళపై సెక్యూరిటీ గార్డులు దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది... దీంతో నెటిజన్లు సదరు సెక్యూరిటీ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.