గుంటూరు: తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు గుంటూరు రేంజ్ డీఐజీ వినీత్ బిజ్రాల్.  

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్పందన కార్యక్రమంలో భాగంగా గుంటూరుకు చెందిన మహిళ తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అయితే ఆ మహిళా పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ రమేష్ కుమార్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. 

డీఎస్పీ రమేష్ కుమార్ ప్రవర్తనపై బాధితురాలు గ్రీవెన్స్ సెల్ లో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. అయితే విచారణలో డీఎస్పీ రమేష్ కుమార్ బాధితురాలిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని తేలడంతో గుంటూరు రేంజ్ డీఐజీ వినీత్ బిజ్రాల్ డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు.