చిత్తూరు: పిల్లి ఆచూకీ కోసం 22 రోజులుగా  గుజరాత్ రాష్ట్రానికి చెందిన దంపతులు రేణిగుంటలో వెతుకుతున్నారు. కొడుకుగా  చూసుకొంటున్న తమ పిల్లి ఆచూకీ చెబితే తగిన పారితోషకం ఇస్తామని  ఆ దంపతులు చెబుతున్నారు. పిల్లి ఆచూకీ చెబుతామని  కొందరు ఆకతాయిలు రూ. 50వేలు తీసుకొని ఉడాయించారు.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన జయేష్ అతని భార్య మీనాలు ఈ ఏడాది జూన్ 9వ తేదీన తిరుమలకు వచ్చారు. తమతో వచ్చే సమయంలో తమ పెంపుడు పిల్లిని కూడ తెచ్చుకొన్నారు. 

వీరిద్దరికి పెళ్లై 17 ఏళ్లు అవుతోంది. కానీ, పిల్లలు లేరు. ఏడాది క్రితం నుండి పిల్లిని పెంచుకొంటున్నారు.ఈ పిల్లికి బాబు అని పేరు పెట్టారు. ఈ పిల్లినే తమ కొడుకుగా ఆ దంపతులు చూసుకొంటున్నారు.

వెంకన్న దర్శనం చేసుకొని  జూన్ 13వ తేదీన గుజరాత్ కు తిరిగి వెళ్లేందుకు రేణిగుంట రైల్వే స్టేషన్‌కు  వెళ్లారు. అయితే రైల్వేస్టేషన్‌లోనే ఈ పిల్లి తప్పిపోయింది. పిల్లి కోసం వెతుకుతూ ఆ దంపతులు రేణిగుంటలోనే ఉండిపోయారు.

అయితే పిల్లిని వెతికి ఇస్తామని ఆకతాయిలు  రూ. 50 వేలను ఆ దంపతుల నుండి తీసుకొన్నారు. కానీ,  పిల్లి ఆచూకీ దొరకలేదు. తమ పిల్లిని వెతికి పెట్టాలని కోరుతూ ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

అయితే ఈ దంపతులను పిచ్చివాళ్ల మాదిరిగా ట్రీట్ చేసిన పోలీసులు వారిపై కేసు పెడతామని బెదిరించారు. దీంతో తమ పెంపుడు పిల్లి కోసం ఆ దంపతులు వెతుకుతున్నారు. 

గుంటూరు, శ్రీకాళహస్తి , విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడ పిల్లి కొసం ఆ దంపతులు గాలించారు. తమ పిల్లి దొరికితేనే తాము ఇక్కడి నుండి వెళ్తామని ఆ దంపతులు చెబుతున్నారు.