రజనీ ఎఫెక్ట్: గుంటూరు వైసీపీలో చిచ్చు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 26, Aug 2018, 11:26 AM IST
Group politics in gunturu ysrcp
Highlights

గుంటూరు జిల్లా వైసీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమరానికి ముందే పార్టీలో సెమీఫైనల్ పోరు జరుగుతోంది. కొత్తనేతల రాక ఆపార్టీలో చిచ్చు రేపుతోంది. పార్టీలో చేరికలు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కొత్త నేతలు పార్టీలోకి చేరుతుంటే ఇప్పటి వరకు పార్టీ పగ్గాలు మోస్తున్న తమ సీటుకు ఎక్కడ ఎసరొస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారట. మరికొంతమందైతే తమ సీటుకు ఎసరొస్తే పార్టీ వీడేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారట. 

గుంటూరు: గుంటూరు జిల్లా వైసీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమరానికి ముందే పార్టీలో సెమీఫైనల్ పోరు జరుగుతోంది. కొత్తనేతల రాక ఆపార్టీలో చిచ్చు రేపుతోంది. పార్టీలో చేరికలు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

కొత్త నేతలు పార్టీలోకి చేరుతుంటే ఇప్పటి వరకు పార్టీ పగ్గాలు మోస్తున్న తమ సీటుకు ఎక్కడ ఎసరొస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారట. మరికొంతమందైతే తమ సీటుకు ఎసరొస్తే పార్టీ వీడేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారట.  

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీలో చిలకలూరిపేట ఎమ్మెల్యే గెలుపొందిన రాజశేఖర్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ 2014 ఎన్నికల్లో మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో పరాజయం పొందారు. రాజకీయ ప్రత్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును ఎప్పటికప్పుడు ఢీ కొంటూ తన ఇమేజ్ ను పెంచుకుంటూనే ఉన్నారు.  

అయితే మర్రి రాజశేఖర్ ఆర్థికంగా బలహీనం కావడం...కాస్త అనారోగ్యం పాలవ్వడంతో చిలకలూరిపేట నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ దృష్టిసారించారు. రాజశేఖర్ కు ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషించారు. అయితే ఇటీవలే తెలుగుదేశం పార్టీ నేత...ఎన్ఆర్ఐ విడదల రజనీ వైసీపీలో చేరారు. విశాఖపట్టణంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. 

పార్టీ కండువా కప్పుకున్న రజనీ రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటుంది. త్వరలోనే చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ గా కూడా నియమిస్తారని ప్రచారం చేసుకుంటున్నారట. ఈ విషయం తెలుసుకున్న మర్రి రాజశేఖర్ పార్టీ నిర్ణయంపై ఆగ్రహంతో  ఉన్నారట.

పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న తననున కాదని రజనీకి సీటు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. రజనీ రాకతో మర్రి రాజశేఖర్ అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజశేఖర్ నివాసంకు చేరుకుని పార్టీ మారాలంటూ ఒత్తడి తెస్తున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగాలని సూచిస్తున్నారు. 
 
మర్రి రాజశేఖర్ కుటుంబం రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పిల్లనిచ్చిన మామ మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజశేఖర్‌ అతితక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనా పార్టీ కేడర్ ను కాపాడుకోవడంలో మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో ఢీ అంటే ఢీ అంటుకున్నారు.

అంతటి ఛరిష్మా ఉన్న నాయకుడిని కాదని టీడీపీ నుంచి వచ్చిన రజనీకి సీటెలా ఇస్తారంటూ అనుచరులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ అస్వస్థతకు గురవ్వడం సాకుగా చూపి అభ్యర్థిని మార్చాలని ప్రయత్నిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.  
 
ఇకపోతే రజనీని చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ గా అధికారికంగా ప్రకటిస్తే తన నిర్ణయం ప్రకటిస్తానని అప్పటి వరకు కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారట. ఒకవేళ నియోజకవర్గ ఇంచార్జ్ గా రజనీని ప్రకటిస్తే పార్టీకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతానని సన్నిహితులు వద్ద చెప్తున్నారని సమాచారం. 

చిలకలూరిపేటతోపాటు మరో మూడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీలో రాజకీయ పోరు నడుస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి.  నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న కావటి మనోహర్‌నాయుడును కూడా మార్చాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. మనోహర్ నాయుడు కంటే బలమైన అభ్యర్థి దొరికితే వారికే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రచారం జరుగుతుండటంతో మనోహర్ నాయుడు అలకబూనారు.

 కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో పెదకూరపాడు సీటు కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తానని జగన్ వైసీపీ నేతలతో రాయబారం పంపినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే కన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో మనోహర్ నాయుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

చిలకలూరిపేట నియోజకవర్గం ఇంచార్జ్ మారిస్తే తనను కూడా మారుస్తారని భావిస్తున్న మనోహర్ నాయుడు భవిష్యత్ పై పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే నియోజకవర్గం నుంచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పార్టీ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీటు తనకు కాకుండా వేరొకరికి ఇస్తే పార్టీ వీడేందుకు మనోహర్ నాయుడు సిద్ధంగా ఉన్నారని టాక్.

 ఈ వార్తలు కూడా చదవండి

పత్తిపాటిపై పంతం: జగన్ పార్టీలో చేరిన ఎన్నారై మహిళ
 

loader