ఉద్యమాన్ని చీల్చే ఇలాంటి నేతలను పిలవొద్దంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అశోక్‌ బాబు వెంటనే వేదికపైనుంచి దిగిపోవాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 

ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబుకి ఉద్యోగులు దిమ్మతిరిగే షాకిచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని (సీపీఎస్‌) రద్దు చేయాలంటూ విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు శనివారం చేపట్టిన ధర్నాలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

జింఖానా మైదానంలో కొనసాగుతున్న ఉద్యోగుల సభకు ఆయన హాజరుకావడంపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అశోక్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను వేదికపైకి ఆహ్వానించడాన్ని అడ్డుకున్నారు. ఉద్యమాన్ని చీల్చే ఇలాంటి నేతలను పిలవొద్దంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అశోక్‌ బాబు వెంటనే వేదికపైనుంచి దిగిపోవాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.

ఊహించని ఈ పరిణామానికి అశోక్ బాబు షాకయ్యారు. కాస్త తేరుకొని ఉద్యోగులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉద్యోగులు మాత్రం వారి ఉద్యమాన్ని కొనసాగించారు.