అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి రానుందా...? ఏపీ డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ అనంతరం జరిగిన ప్రెస్మీట్ లో ప్రత్యేకించి కాల్ మనీ రాకెట్ గురించి ప్రస్తావించడంపై అందులో ఉన్న మర్మం ఏంటి...?

విజయవాడ పోలీస్ కమిషనర్ గా గౌతమ్ సవాంగ్ పనిచేస్తున్న తరుణంలో ఈ కేసు తెరపైకి రావడం ఆయన ఉక్కుపాదం మోపారు. ఆ కేసు స్టడీలో అన్ని ఆధారాలు సేకరించిన గౌతమ్ సవాంగ్ నేరుగా కాల్ మనీ కేసును పర్యవేక్షించే అవకాశం ఉందా...?

కాల్ మనీ కేసులో తెలుగుదేశం నేతల కీలక ప్రమేయం ఉన్న నేపథ్యంలో వారితో జైల్లో ఊచలు లెక్కించేందుకు జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా...?ఇవే ఆలోచనలు ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదినీ తొలిచివేస్తున్నాయి. 

కాల్ మనీ కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాజీ ఎమ్మెల్యేలు బొడా ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్ అనుచరుల్లో ఆందోళన నెలకొంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు. అప్పులు ఇచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకోవడంతోపాటు, వారిని వ్యభిచార కూపంలో దించుతున్న కాల్‌మనీ కేసు మళ్లీ తెరపైకి వస్తుండటం ఇప్పుడు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 

కాల్ మనీ కేసుకు సంబంధించి ఆ ముఠాకు డబ్బు సమకూర్చేది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అని ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల నిందితులుగా గుర్తించిన వారు కేవలం అనుచరుల మాత్రమేనని అసలు నేరస్థులను చంద్రబాబు తప్పించారంటూ ఆనాడు వైసీపీ నేతలు ఆరోపించిన దాఖలాలు లేకపోలేదు. 

ఈ కాల్ మనీ కేసుపై పోరాటం చేసినందుకు, అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమెను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ కు గురి చేశారు. అయితే కాల్ మనీ కేసుపై తాను పోరాడుతున్నానని అందువల్లే తనను అకారణంగా సస్పెండ్ చేశారంటూ ఆమె ఆరోపించారు.

ఆనాడు ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ సైతం కాల్ మనీ కేసుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల నెత్తురుతో వ్యాపారం చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసుపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కూడా. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బాధితులు ఇప్పటికీ కాల్ మనీ కేసుపై న్యాయం కోసం పోరాడుతున్న నేపథ్యంలో కేసును తెరపైకి తెచ్చే యోచనలో జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆనాడు విజయవాడ సీపీగా ఉన్న గౌతం సవాంగ్ కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులు పలువురిని అరెస్ట్ చేశారు. వారిలో డిఈ సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, యలమంచిలి శ్రీరామ్మూర్తి, దూడల రాజేశ్ లను ఆనాడు అరెస్ట్ చేశారు.  

యలమంచిలి రాము, శ్రీకాంత్‌ల చేతిలో మోసపోయామంటూ పలువురు మహిళలు ఆనాడు విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు విజయవాడలోని పడమట పంటకాల్వ రోడ్డులో ఉన్న కాల్‌మనీ కార్యాలయంలో జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఆయన సోదరుడు బుద్దా నాగేశ్వరరావు, బోడె ప్రసాదరావు, బొండా ఉమామహేశ్వరరావులకు చెందిన అనుచరులే  అరెస్ట్ అయిన వారిలో ఉండటంతో వారితో సంబంధాలపై సీపీగా ఉన్న గౌతం సవాంగ్ ఆరా తీశారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ లో అరెస్ట్ అయిన యలమంచిలి రాము ఏపీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్కే ప్రసాద్‌కు బంధువు. కృష్ణా జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులకు సమీప బంధువు కావడం విశేషం. రాముకు గతంలో దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. 

కాల్ మనీ వ్యవహారంలో కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు సంబంధం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆయన రూ.3 కోట్లు వరకు పెట్టబడి పెట్టినట్లు ప్రచారం జరిగింది.  

కాల్ మనీ కేసులో అత్యంత కృూరుడిగా వెనిగళ్ల శ్రీకాంత్ పేరు వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ బోడె ప్రసాద్ కు అత్యంత సన్నిహితుడు అని పెద్దఎత్తున వార్తలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు కాల్ మనీ కేసులో వచ్చిన డబ్బుతో ఇద్దరూ కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసేవారని కూడా ప్రచారం జరిగింది. 

కాల్ మనీ కేసుల వెలుగులోకి వచ్చినప్పుడు శ్రీకాంత్, బోడె ప్రసాద్ లు విదేశాల్లోనే ఉండటం విశేషం. అదే సమయంలో వీరిద్దరూ కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు సైతం హల్ చల్ చేశాయి. 

 ఇకపోతే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైతం ఈ కాల్ మనీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఆయన సోదరుడు నాగేశ్వరరావును నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. 

కాల్ మనీ  రాకెట్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో తాను దోషిని అని తేలితే ఎంతటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు కూడా.  

కాల్ మనీ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భవానీ శంకర్ ఓ బౌన్సర్. అతను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరుడైన కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కనుసన్నుల్లోనే భవానీ శంకర్ ఈ వ్యవహారం నడిపినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 

ఇకపోతే ఈ కేసులో మరో నిందితుడు దూడల రాజేశ్. దూడల రాజేశ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు. ఒకసారి కృష్ణా జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దూడల రాజేశ్ వైసీపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తో కలిసి దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న బోండా ఉమామహేశ్వరరావు ఈ ఫోటోలను మీడియాకు విడుదల చేస్తూ జగన్ కు రాజేశ్ కు ఉన్న సంబంధాన్ని బయటపెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ నానా రచ్చ కూడా చేశారు. దానికి జగన్ వివరణ సైతం ఇచ్చారు. 

డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌతం సవాంగ్ తొలి మీడియా సమావేశంలో కాల్ మనీ కేసుపై ప్రత్యేకించి ప్రస్తావించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు గనుక తెరపైకి వస్తే తెలుగుదేశం పార్టీ నేతలు చిక్కుల్లో పడటం తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి.