సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి గోరంట్ల మాధవ్. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఆయన.. వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా..., ఆయనకు ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... ఆయనకు కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ పెరిగిపోవడం విశేషం.

గెలిచినా ఎటువంటి భేషజాలకు పోకుండా ఆచితూచి ఆయన చెబుతున్న మాటలు కూడా చాలామందికి నచ్చుతున్నాయి. ఇప్పటికే గోరంట్ల మాధవ్‌ గురించి కన్నడ పత్రికలు, మీడియా కూడా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఆయన గెలుపు ఒక ఎత్తయితే.. గెలిచిన తరువాత పై అధికారులకు సెల్యూట్‌ చేసిన ఫోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

‘గెలుపంటే ఇదీ...గొప్ప వ్యక్తి...గొప్పవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు’ అంటూ ప్రశంసిస్తున్నారు.   ఆయన ఫోటోని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.