రాజకీయ పార్టీల అంతిమలక్ష్యం ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవడం. ఈ క్రమంలో కొన్నిసార్లు పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా వుంటాయి. ఇలా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు, గోపాలపురం వైసిపి అభ్యర్ధుల ఎంపిక అలాగే వుంది. ఈ రెండుచోట్ల వైసిపి ఎమ్మెల్యేలే సిట్టింగ్ లుగా కొనసాగుతున్నారు...   కానీ ఈసారి ఒకరి నియోజకవర్గానికి మరొకరు షిప్ట్ అయ్యారు. ఇలా గోపాలపురం నుండి తానేటి వనిత, కొవ్వూరు నుండి తలారి వెంకట్రావు బరిలోకి దిగారు. వైసిపి నిర్ణయం ఫలించిందో లేక బెడిసికొట్టిందో ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. 

గోపాలపురం రాజకీయాలు : 

గోపాలపురం అసెంబ్లీపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టువుంది. టిడిపి మొదటిసారి పోటీచేసిన 1983 నుండి 1999 వరకు గోపాలపురంలో ఓటమన్నదే ఎరుగదు. ప్రస్తుత గోపాలపురం వైసిపి అభ్యర్థి తానేటి వనిత కూడా గతంలో టిడిపి ఎమ్మెల్యేనే. 2009 లో గోపాలపురం అసెంబ్లీకి టిడిపి నుండి పోటీచేసి గెలిచారు వనిత. 

1983 నుండి 2019 వరకు కేవలం రెండుసార్లు మాత్రమే టిడిపికి గోపాలపురంలో ప్రాతినిధ్యం లేదు. కారుపాటి వివేకానంద, జొన్నకూటి బాబాజీ రావు, ముప్పిడి వెంకటేశ్వరరావు వంటివారు గోపాలపురం నుండి టిడిపి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్య వహించారు. అయితే 2019 లో టిడిపిని ఓడించి గోపాలపురంలో వైసిపి జెండా ఎగరేసారు తలారి వెంకట్రావు. 

గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. ద్వారకా తిరుమల 
2. నల్లజర్ల 
3. దేవరపల్లి 
4. గోపాలపురం 

గోపాలపురం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,32,023

పురుషులు - 1,15,365
మహిళలు ‌- 1,16,743

గోపాలపురం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

గోపాలపురం అసెంబ్లీ బరిలో మహిళా హోంమంత్రి తానేటి వనిత నిలిచారు. ఆమెను కొవ్వూరు నుండి గోపాలపురంకు మార్చారు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు షిప్ట్ చేసారు. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ గోపాలపురం అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజును బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. లేదంటే మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకే మరోసారి అవకాశం ఇవ్వనుంది. ఇప్పటికయితే గోపాలపురం అభ్యర్థిని టిడిపి ప్రకటించలేదు. 

గోపాలపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

గోపాలపురం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,99,464 

వైసిపి - తలారి వెంకట్రావు - 1,11, 785 (56 శాతం) ‌ - 37,464 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

టిడిపి - ముప్పిడి వెంకటేశ్వరరావు - 74,324 (37 శాతం) - ఓటమి 


 గోపాలపురం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,86,343 (86 శాతం)

 టిడిపి - ముప్పిడి వెంకటేశ్వరరావు - 95,299 (51 శాతం) - 11,540 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - తలారి వెంకట్రావు - 83,759 (40 శాతం) - ఓటమి