తిరుమలలోని హథిరాంజీ మఠంలో బంగారం, వెండి వస్తువులు మాయమైన ఘటన వెలుగు చూసింది. అకౌంటెంట్ బీరువాలోని ఆభరణాల లెక్కల్లోని తేడాను అధికారులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే... హథీరాంజీ మఠం అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో మఠంలోని కొన్ని బీరువాల తాళం చెవులు కనిపించకపోవడంతో సిబ్బంది గుర్రప్ప కుటుంబసభ్యులను ఆరా తీశారు.

ఈ సందర్బంగా ఆయన ఇంట్లో గాలించి మఠానికి చెందిన తాళం చెవులును తీసుకొచ్చారు. అందరి సమక్షంలో అధికారులు బీరువాను తెరిచి పరిశీలించగా.. 108 గ్రాముల బంగారు డాలర్, ఇతర వెండి వస్తువులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో నగల మాయంపై మఠం సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అప్రైజర్‌తో లెక్కకట్టి ఎన్ని నగలు పోయాయో తెలుపుతామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొందరు పూజారులపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇటీవలే పలు ప్రముఖ ఆలయాల్లో నగలు, నగదు లెక్కల్లో అవకతవకలు వెలుగు చూస్తుండటం కలకలం రేపుతోంది. ఇటీవలే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.