ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు సరస్వతీ దేవి విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని అకివీడు పాఠశాలలో జరిగింది. 

పోలీసుల కథనం ప్రకారం... దుండగులు సరోజినీ నాయుడు బాలికల ఉన్నత పాఠశాలలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ విషయంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ టీచర్ చెప్పారు. తాము ఉదయం పాఠశాలకు వచ్చామని, సరస్వతీ దేవి, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించామని టీచర్ చెప్పారు. 

అది తమకు ఆవేదన కలిగించిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు పాఠశాలకు వచ్చి పరిశీలించి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలలో నైట్ వాచ్ మన్ ను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. పొట్టి శ్రీరాములు భారత స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అసువులు బాశారు.