విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమానుషమైన సంఘటన జరిగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను మభ్య పెట్టి తమ కోరికను తీర్చుకుంటూ వచ్చారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన ఎలమంచిలి మండలం కొత్తల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 

ఎలమంచిలి సీఐ నారాయణరావు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కొత్తల్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆమె నాయనమ్మ, తాతయ్య వద్ద ఉంటోంది. 

తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత బడి మానేసింది. ఇంటి వద్దనే ఉంటోంది. నాయనమ్మ, తాతయ్య వ్యవసాయ కూలీలు. దాంతో వారు ప్రతి రోజూ ఉదయం వెళ్లి సాయంంత్రం ఇంటికి వస్తారు. ఇంట్లో బాలిక ఉండడాన్ని గమనించిన ముగ్గురు బెదిరించి, మభ్య పెట్టి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తూ వచ్చారు. దాంతో ఆమె గర్భం దాల్చింది. 

ఇటీవల పొట్ట పెరగడంతో నాయనమ్మ బాలికను తుని ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్భం దాల్చిందని చెప్పారు. దాంతో బంధువులు అవాక్కయ్యారు. బాలికను ఏం జరిగిందని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుల్లో ఒకతను పెయింటర్, మరొకరు వ్యవసాయ కూలీ అని అర్థమైంది. మూడో వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడని తేలింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.