తన కూతురు వెంటపడుతున్నాడని ఓ యువకుడిని ఇంట్లో బంధించిన ఓ వ్యక్తి అతి క్రూరంగా అతడి మర్మాంగాలపై దాడిచేసాడు. దీంతో యువకుడు అపస్మారక స్థితిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నాడు. 

ఏలూరు: ఇటీవల తెలుగులో వచ్చిన ఉప్పెన సినిమా (uppena movie) క్లైమాక్స్ మీకు గుర్తుందా... తన కూతురుని ప్రేమించిన హీరో మర్మాంగాన్ని అతి క్రూరంగా కోయిస్తాడు హీరోయిన్ తండ్రి. సేమ్ టు సేమ్ ఈ సినిమాలో మాదిరిగానే ఓ వ్యక్తి అతి క్రూరంగా వ్యవహరించాడు. తన కూతురి వెంటపడుతున్న యువకుడి మర్మాంగంపై రోకలిబండతో దాడిచేసాడు. దీంతో యువకుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ దారుణం ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహరావు పాలెంకు చెందిన సింగపం శ్రీకాంత్ (24) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమపేరుతో వెంటపడుతున్నాడు. అయితే ఈ విషయం యువతి తండ్రి జాన్ కు తెలిసింది. దీంతో శ్రీకాంత్ పై కోపంతో రగిలిపోయిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. 

VIDEO

మాట్లాడేది వుందని చెప్పి శ్రీకాంత్ ను తన ఇంటికి పిలిపించాడు జాన్. ఇలా శ్రీకాంత్ ఇంట్లోకి రాగానే తలుపులు మూసేసి దాడికి దిగాడు జాన్. ఓ చీకటి గదిలో బంధించి యువకున్ని చిత్రహింసలకు గురిచేసాడు. కాళ్లు చేతులు కట్టేసి యువకున్ని చితకబాదడమే కాదు అతి సున్నితమైన మర్మాంగంపైనా రోకలిబండతో దాడి చేసాడు. దీంతో యువకుడి మర్మాంగాలు చిధ్రమై తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

యువకుడి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని యువతి ఇంట్లో బంధించిన యువకున్ని కాపాడి బయటకు తెచ్చారు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో మొదట ఖమ్మం ఆసుపత్రికి... అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడుకు... అక్కడినుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యువకుడు శ్రీకాంత్ చికిత్స పొందుతున్నాడు. మర్మాంగాలు చిద్రమవడంతో యువకుడు పరిస్థితి విషమంగా వుందని... అతడి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి యువకుడి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది.

తమ కొడుకు పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యువతి తండ్రి జాన్ పరారీలో వుండగా అతడి కోసం గాలిస్తున్నారు.