విజయనగరం: చిన్నతనం నుంచి కుటుంబంతో అనుబంధం ఎక్కువ. అమ్మనాన్న అంటే వల్లమాలిన ప్రేమ. తల్లిదండ్రులకు చెప్పుకుండా ఏ పనిచెయ్యని మంచి అమ్మాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కష్టపెట్టకూడదని ఆమె ఎప్పుడూ అంటూ ఉండేది. 

ఎంతకష్టమైనా తానే భరించాలి తప్ప కన్నవారిని బాధపెట్టనని స్నేహితుల దగ్గర చెప్పేది. తల్లిదండ్రుల మనుసు నొప్పించకూడదని ఆమె పదేపదే చెప్పేదట. అటు ఆ యువతి క్రమశిక్షణ, తమపై చూపిస్తున్న ప్రేమను చూపి తల్లిదండ్రులు తోబుట్టువులు సైతం మురిసిపోయేవారట.    

అందరిలాగే ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. బయటి సంబంధం అయితే ఎలా ఉంటుందో ఏమోనని భయపడిన వారు దగ్గరి బంధువుతోనే పెళ్లికి నిశ్చయించారు. ఆ పెళ్లి నిర్ణయమే ఆ యువతిని బలితీసుకుంది. 

పెళ్లి సంబంధం ఇష్టం లేని ఆ యువతి తల్లిదండ్రుల నిర్ణయానికి ఎదురు చెప్పలేక బలవన్మరణానికి పాల్పడింది. పసుపు తాడు పడాల్సిన మెడలో ఉరితాడు బిగించుకుని మరణశాసనం రాసుకుంది. కన్నవారికి శోకాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అందర్నీ కలచివేస్తున్న ఈ హృదయ విదారకర ఘటన విజయనగరం జిల్లా మెంటాడలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా మెంటాడ మండలం బడేవలస గ్రామానికి చెందిన పొట్నూరు అప్పారావు, వెంకటరమ ణలకు ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె నిర్మల డిగ్రీ వరకు చదువుకుంది. అయితే ఆమెకు రెండు నెలల కిందట దగ్గరి బంధవుతో వివాహం నిశ్చయించారు తల్లిదండ్రులు. 

నిర్మలకు ఆ సంబంధం ఇష్టం లేదు. దీంతో తల్లిదండ్రులతో తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు అని చెప్పింది. అబ్బాయి మంచోడు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. తనకు ఇష్టం లేని సంబంధం చేస్తున్నారని రెండు నెలలుగా నిర్మల మానసిక ఆందోళనకు గురైంది.  

సున్నిత మనస్కురాలైన నిర్మల తన మనోవేదనను బయట పెట్టలేదు. ఇప్పట్లో పెళ్లి ఎందుకని రెండు సార్లు కుటుంబ సభ్యులకు చెప్పడం మినహా సంబంధం ఇష్టం లేదని చెప్పలేకపోయింది. తల్లిదండ్రులు బాధపడతారని భావించింది. 

రెండు కటుంబాల మధ్య పొరపచ్చాలు ఏర్పడతాయేమోనని మానసిక సంఘర్షణకు లోనైంది. పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్తే ప్రేమ వ్యవహారం అంటగడతారేమోనని భయాందోళనకు  గురైంది. తన తల్లిదండ్రులకు చెప్పలేక తన బాధ ఎవరితోనూ పంచుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఉరికొయ్యాన వేలాడింది. 
 
కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కొద్ది నెలల్లో నిర్మలకు పెళ్లి చేసి అత్తవారింటి పంపిద్దామని చూశామని ఇలా కాటికి పంపాల్సి వస్తుందని ఊహించలేదని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పెళ్లి ఇష్టం లేదంటే చేసేవాళ్లం కాదని కానీ ఇంత ఘోరానికి పాల్పడుతుందని తాము ఊహించలేదని వారు బోరున విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేస్తోంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంటిలో చావుడప్పు మోగడంతో ఆ ప్రాంతంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.