భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత: టీటీడీ
అల్పపీడనం కారణంగా తిరుమలలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా తిరుమలకు కాలి నడకన వెళ్లే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మూసేసినట్టు ప్రకటించింది. 17వ, 18వ తేదీల్లో ఈ కనుమ దారులు మూసే ఉన్నాయి. 19వ తేదీ కూడా మూసే ఉంటాయని వివరించింది. వాటిని తెరవడంపై ప్రత్యేక ప్రకటన చేస్తామని తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొన్ని రోజులుగా వర్షాలు(Rains) కురుస్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులూ పాట్లుపడుతున్నారు. కడప, తిరుపతి జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కాగా, తిరుమల రెండు ఘాట్ రోడ్లనూ అధికారులు మూసేశారు. తిరుమలకు కాలి నడకన వెళ్లే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను ఈ నెల 17వ తేదీ, 18వ తేదీల్లో మూసేసిన సంగతి తెలిసిందే. అయితే, వరద ఉధృతి తగ్గకపోవడం, ఇంకా దారులు అసౌకర్యంగానే ఉండటంతో 19వ తేదీ కూడా ఈ కనుమ రోడ్లను మూసే ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఘాట్ రోడ్ల(Ghat Roads)ను తిరిగి తెరిచే తేదీని ప్రత్యేకంగా వెల్లడిస్తామని వివరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తిరుమలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కడప, తిరుపతి హైవేపై కొన్ని చోట్ల నదిని తలపించే పరిస్థితులు నెలకొన్నాయి. అలిపిరి నడక మార్గం, కనుమదారుల్లోనూ వరద ఉధృతంగా పారుతున్నది. మెట్లమార్గం జలపాతాన్ని తలపిస్తున్నది. అడవి నుంచి వరదలు జోరుగా వస్తున్నాయి. రహదారిపై చెట్లు కూలడం, కొండచరియలు విరిగిపడి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఘాట్ రోడ్లను మూసేసింది.
Also Read: Heavy rains: భారీ వర్షాలు.. తిరుమలలో విరిగిపడిన కొండచరియలు.. రేణిగుంటలో విమాన సర్వీసులకు అంతరాయం..
చిత్తూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక రేణిగుంటలో ల్యాండ్ కావాల్సిన విమానాలు తిరిగి వెనక్కి వెళ్తున్నాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో.. హైదరాబాద్ వెనుదిరిగి వెళ్లాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి రేణిగుంట వస్తున్న ఇండిగో విమానాన్ని విమానాశ్రయం అధికారులు బెంగళూరుకు మళ్లించారు.