అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఇస్తామని నమ్మించి ఓ గోల్డ్ లోన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలో ఘ‌రానా మోసం వెలుగులోకి వ‌చ్చింది. బంగారంపై అతి త‌క్కువ వ‌డ్డీతో లోన్లు ఇస్తామ‌ని చెప్పి బంగారం తీసుకొని ఉడాయించారు. దీంతో ఆ సంస్థ‌లో బంగారం తాక‌ట్టు పెట్టిన వంద‌లాది మంది బాధితులు ల‌బోదిబోమంటున్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. 

75 పైస‌లే వ‌డ్డీ అంటూ..
విజ‌య‌వాడ‌లోని భ‌వానీపురంలో అదితి గోల్డ్ లోన్స్ అని ఓ ఫైనాన్స్ కంపెనీ ఉంది. దీనిని బెంగళూరుకు చెందిన హ‌ర్షిత్ అనే వ్య‌క్తి నిర్వ‌హిస్తున్నాడు. స‌గ‌టు మ‌నిషి అస‌వ‌రాన్ని ఆస‌రాగా తీసుకొని 75 పైసల‌కే లోన్ అంటూ ప్ర‌చారం చేశాడు. అతి త‌క్కువ వ‌డ్డీ కావ‌డంతో చాలా మంది ఈ సంస్థ‌లో బంగారం తాక‌ట్టు పెట్టేందుకు ముందుకొచ్చారు. వారందరి నుంచీ బంగారం తీసుకొని లోన్ల రూపంలో కొంత న‌గ‌దు వారి చేతిలో పెట్టారు. మార్కెట్‌లో ఉన్న వ‌డ్డీ రేటు కంటే ఇక్క‌డ త‌క్కువ‌కే లోన్లు ల‌భిస్తుండ‌టంతో చాలా మంది ఇత‌ర ఫైనాన్స్ కంపెనీల నుంచి బంగారాన్ని విడిపించుకొని ఈ అదితి గోల్డ్ లోన్స్ సంస్థ‌లో బంగారం తాక‌ట్టు పెట్టారు. కొన్ని రోజుల్లోనే వందలాది మంది ఈ సంస్థ‌లో లోన్ తీసుకునేందుకు ముందుకు వ‌చ్చారు. దీంతో కిలోల కొద్దీ బంగారం ఆ సంస్థ‌లో తాక‌ట్టు కింద వ‌చ్చింది. సెప్టెంబ‌ర్ చివ‌ర్లో ఆ సంస్థ‌లో ఉన్న బంగారం మొత్తాన్ని తీసుకొని ఆ నిర్వాహ‌కుడు ఉడాయించాడు. ఒక్కసారిగా అత‌డు బోర్డు తిప్పేయ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ కేసులో ఇంకా పురోగ‌తి క‌నిపించ‌క‌పోవ‌డంతో ప‌లువురు బాధితులు సోమ‌వారం విజయ‌వాడ సీపీని క‌లిశారు. త‌మ బాధ‌ను మొత్తం సీపీతో చెప్పుకున్నారు. తొంద‌ర‌గా త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని కోరారు. మోసగాడి నుంచి త‌మ‌కు బంగారం వ‌చ్చేలా చూడాల‌ని విన్న‌వించుకున్నారు. 

ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. గాల్లోనే గంటపాటు చక్కర్లు..

అన్నీ ఫేక్ స‌ర్టిఫికెట్లే...
బెంగుళూరుకు చెందిన హ‌ర్ష ప‌క్కాగా అన్నీ ఫేక్ స‌ర్టిఫికెట్లు ముందే సిద్ధం చేసుకొని ఉంచుకున్నాడు. జీఎస్టీ, గోల్డ్ ఫైనాన్స్ పెట్టుకునేందుకు అవ‌స‌ర‌మైన ఇత‌ర స‌ర్టిఫికెట్లు, బిజినెస్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ఫేక్ స‌ర్టిఫికెట్ల‌ను అత‌డు రెడీ చేయించుకున్నాడు. అనుమానం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ వాటిని చూపించాడు. ఇలా చాలా మంది మోస‌పోయారు. కేవ‌లం బంగారం తాక‌ట్టు పెట్టి లోన్లు తీసుకున్న‌వారే మోస‌పోయారంటే పొరపాటే. అసలు అందులో నుంచి ఎలాంటి లోన్లు తీసుకోని ప‌లువురు కూడా అత‌డి వ‌ల‌లో ప‌డి మోస‌పోయారు. జిల్లాలో ఉండే ప‌లురువు వ్యాపార‌స్తులను అత‌డు మోస‌గించారు. త‌న బిజినెస్ వాటా ఇస్తాన‌ని చెప్పి ఓ బంగారం షాపు వ్యాపార‌స్తుడి ద‌గ్గ‌రి నుంచి రూ.5 ల‌క్ష‌లు, మ‌రో వ్య‌క్తి నుంచి రూ.5 ల‌క్ష‌లు తీసుకున్నారు. లాభాల్లో వాటా వ‌స్తుంద‌నే ఆశ‌తో వారు అత‌డి వ‌ద్ద పెట్టుబ‌డి పెట్టారు. ఆ డ‌బ్బుల‌నే కష్ట‌మ‌ర్ల‌కు లోన్ల రూపంలో ఇచ్చి న‌మ్మ‌కం ఏర్ప‌ర్చుకున్నాడు. అలా క‌ష్టమ‌ర్లు పెరిగారు. బంగారం ఎక్కువ మొత్తంలో ఆ సంస్థ‌లో జ‌మ అయిన త‌రువాత అత‌డి ప్లాన్ ప్రకారం ఆ బంగారంతో స‌హా జంప్ అయ్యాడు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.