చిత్తూరు: ఊహించిందే జరిగింది. ప్రేయసిని కత్తితో పొడిచి హత్య చేసున యవకుడు ఢిల్లీ బాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రేయసి గాయత్రిని అతను మంగళవారంనాడు హత్య చేసి అడవుల్లోకి పారిపోయిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లా పెనుమూరు వద్ద గాయత్రిని 15 సార్లు ఢిల్లీ కత్తితో పొడిచి పారిపోయాడు. అడవిలోకి పారిపోయిన ఢిల్లీ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానించారు.. ఢిల్లీ బాబు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి (19) అనే యువతిని పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు (19) ప్రేమించాడు. వీరిద్దరు రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. 

పెళ్లి చేసుకున్న సమయంలో ఇద్దరు కూడా మైనర్లు. దీంతో పోలీసులు వారిద్దరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 

ఇదిలావుంటే, మంగళవారం మధ్యాహ్నం పెనుమూరు వద్ద సంత నుంచి తిరిగి వెళ్తున్న గాయత్రిని ఢిల్లీ దారి కాచి ఆపాడు. ఆమె మీద కత్తితో దాడి చేసి పారిపోయాడు. యువతిని పోలీసులు వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.