విశాఖపట్నం: ఎల్జీ పరిశ్రమవంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 86 కంపెనీలు ఉన్నాయని పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. భద్రతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాత వాటికి అనుమతులు ఇస్తామని ఆయన చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులతో ఆయన శుక్రవారంనాడు సమావేశమయ్యారు. 

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో పరిస్థితి మరో 48 గంటల్లో అదుపులోకి వస్తుందని ఆయన చెప్పారు. స్టైరిన్ గాలిలో తక్కువ మోతాదులోనే ఉందని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన చాలా బాధాకరమైందని అన్నారు. ట్యాంక్ పరిస్థితిని సమీక్షించినట్లు ఆయన తెలిపారు. 

ట్యాంక్ ఉష్ణోగ్రత 120 డిగ్రీలకన్నా తక్కువగా ఉందని చెప్పారు. కొన్ని రసాయనాలతో ట్యాంక్ ఉష్ణోగ్రతను తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుంటే, ఎల్జీ పాలీమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతమైతే గ్యాస్ లీకేజీ లేదని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం ఎల్జదీ పాలీమర్స్ ను సందర్శించారు. గ్యాస్ ను నెమ్మదిగా నియంత్రణలోకి తేవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

కెమికల్ గ్యాస్ ట్యాంక్ పేలే అవకాశం లేదని ఆయన చెప్పారు. గ్యాస్ వ్యాపర్ రేపు ఉదయానికల్లా నియంత్రణలోకి వస్తుందని సాంకేతిక నిపుణులు చెప్పినట్లు ఆయన తెలిపారు. గ్యాస్ లీకేజీపై భయాందోళనలు అవసరం లేదని ఆయన అన్నారు. గుజరాత్, పూణే నిపుణులు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక నిపుణులతో టచ్ ఉన్నట్లు అవంతి తెలిపారు.