వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే మంటపాల ఏర్పాటు మొదలై పోయింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ గణనాథుల ఏర్పాటుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.

దీనిలో భాగంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న భారీ గణనాథుడి విగ్రహం తయారీలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని తాతయ్యపాలెంలో పవర్ యూత్ సంఘం సభ్యులు 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేసేందుకు సంకల్పించారు.

ఇందుకోసం నిర్మిస్తున్న భారీ మంటపం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా మంటపం ఒక్కసారిగా కుప్పకూలింది.

దీంతో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమయంలో మంటపం దగ్గర కార్మికులెవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.