ఒంగోలులో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం దొరకడం కలకలం రేపింది. ఆనవాళ్లు లేకుండా పుర్రె, ఎముకలు మాత్రమే దొరకడం ఇప్పుడు పోలీసులకు సవాల్ గా మారింది.
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ లో కాలిపోయిన మృతదేహం లభించిన మరో ఘటన వెలుగు చూసింది. ఒంగోలు సమీపంలోని బైపాస్ రోడ్డు పక్కన కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహం లభించింది. నాలుగైదు రోజుల క్రితం కాల్చివేసినట్టుగా అస్థిపంజరం ఆనవాళ్లు.. పూర్తి కాలిపోయిన స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ మృతదేహం మహిళదై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అంతకు ముందు మే ఒకటో తేదీన ఇదే బైపాస్ సమీపంలో ఒకరి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో దొరికింది. దానికి సంబంధించిన కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. అంతలోనే మరో మృతదేహం అదే తరహాలో కాలిపోయి, ఆనవాళ్లు కూడా లేకుండా లభించడంతో పోలీసులకు పెను సవాల్ గా మారింది.
పది రోజుల వ్యవధిలో రెండు మృతదేహాలు.. ఒకే రకంగా కాలిపోయిన స్థితిలో దొరకడంతో.. ఈ హత్యలు రెండూ ఒకరే చేశారా? ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందా? ఈ రెండు మృతదేహాలకు ఏదైనా లింకు ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం లభించిన కాలిపోయిన మృతదేహం కేవలం పుర్రె, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. పూర్తిగా కాలిపోయింది.
అయితే, ఘటనా స్థలంలో పోలీసులు సేకరించిన ఎముకలను బట్టి వైద్యులు.. ఎముకల నిర్మాణాన్ని బట్టి మహిళదిగా అనుమానిస్తున్నారు. వరుసగా రెండు ఘటనలు ఒకే రీతిలో జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఒంగోలు బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు.
పెట్రోలింగ్ వాహనాలు, నైట్ బీట్ పోలీసు వాహనాలు ఒంగోలు బైపాస్ రోడ్డుమీద నిత్యం తిరుగుతూనే ఉంటాయి. అయినా ఈ రెండు హత్యలకు సంబంధించిన విషయాలను గుర్తించలేకపోయారు. మృతదేహాలను కూడా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత పోలీసులు ఘటనా స్థలికి రావడం... మృతదేహాలను పరిశీలించడం.. కేసు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
