కర్నూలు: రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో కంట తడి పెట్టిస్తోంది. ఈ నెల 3వ తేదీన అబ్దుల్ సలాంతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పాణ్యం మండలంలోని కొల్లూరు గ్రామ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఆత్మహత్యకు ముందు అబ్దుల్ సలాం కుటుంబం ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేసింది. ఈ సెల్ఫీ వీడియోలు నలుగురు కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అబ్దుల్ సలాం వివరించాడు. 

తీవ్ర మనస్తాపానికి గురై తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అబ్దుల్ సలాం ఆ వీడియోలో చెప్పాడు. తనపై చోరీ కేసు పెట్టారని ఆయన చెప్పాడు. బంగారం దుకాణంలో జరిగిన చోరీతో గానీ ఆటోల దొంగతనంతో గానీ తనకు సంబంధం లేదని చెప్పాడు. తనకు సాయం చేసేవారు ఎవరూ లేకుండా పోయారని ఆయన చెప్పాడు. 

పోలీసుల చిత్రహింసలు భరించలేకపోవడంతో పాటు దొంగతనం కేసుల వల్ల మనస్తాపానికి గురి కావడంతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తాను పనిచేస్తున్న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. అబ్దుల్ సలాంపై ఆ చోరీ కేసు పెట్టారు.