విజయనగరం: రాజకీయాల్లో నిలకడ ఉండాలని మాజీ కేంద్ర మంత్రి  ఆశోక్ గజపతి రాజు      అభిప్రాయపడ్డారు. 

టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంపై ఆయన శెర్రవారం నాడు స్పందించారు. టీడీపీకి కార్యకర్తల బలం ఉందని ఆశోక్ గజపతి రాజు చెప్పారు. కార్యకర్తల నుండి నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. 

కొత్త నాయకత్వం రావాల్సి ఉందని  ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ నెల రోజుల పాలనపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని  ఆశోక్ గజపతి రాజు  చెప్పారు.

విజయనగరం ఎంపీ స్థానం నుండి రెండో దఫా పోటీ చేసి ఆశోక్ గజపతి రాజు ఓటమి పాలయ్యాడు. ఆశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతి రాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కాబట్టే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి నుంచి నూతన నాయకత్వాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

 ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజంటేషన్ కూడా ముఖ్యమేనని తెలిపారు. అయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చిందన్నారు. ఈ కారణంగానే  టీడీపీ ఓడిపోయిందని విశ్లేషించారు. 

ఇప్పటికీ టీడీపీ బలంగానే ఉందనీ, తప్పులు తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి సారించాలని సూచించారు. అలా కాకుండా ఇంకా ఏదో భ్రమలో ఉండిపోతే నాయకత్వం నిలబడదు అని హెచ్చరించారు.