చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటికి  నోటీసులు  జారీ చేయడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు  మండిపడ్డారు.

అమరావతి: చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటికి నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న భవనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిందని ఆయన గుర్తు చేశారు.

లింగమనేని రమేష్ నిర్మించిన భవనంలో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబునాయుడు అద్దెకు నివాసం ఉంటున్నాడు. అయితే నిబంధనలకు విరుద్దంగా ఈ భవనాలను నిర్మించారని ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది.

చంద్రబాబు నివాసం ఉంటున్న భవనానికి నోటీసులు జారీ చేయడం కక్షసాధింపు చర్య కిందకు వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించారని భావిస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఈ భవనాన్ని ఎందుకు కూల్చివేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

వైఎస్ పేరుతో ఉన్న పార్టీని జగన్ నడుపుతున్నాడని యనమల గుర్తు చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన కట్టడమైనందున వీటికి జగన్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తండ్రి అనుమతిచ్చిన నిర్మాణాలకు కొడుకు నోటీసులు పంపడమేమిటని యనమల ప్రశ్నించారు.

ఈ భవనం నిర్మించే సమయానికి సీఆర్‌డీఏ లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు అమరావతి రాజధాని ప్రతిపాదన లేదన్నారు. ఈ భవన నిర్మాణానికి 2008లో గ్రామ పంచాయితీ అనుమతి ఇచ్చిందన్నారు. రివర్ కన్జర్వేటర్ 2012లో అనుమతిని ఇచ్చారని ఆయన ప్రస్తావించారు.

చంద్రబాబుపై కక్షతోనే కృష్ణా నదికి 130 కి.మీ దూరం ఉన్న ప్రజా వేదికను కూలగొట్టారని ఆయన ఆరోపించారు. సీఆర్‌డీఏ ఎలా నోటీసు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. హైకోర్టులో పిల్ పెండింగ్ లో ఉన్న సమయంలో నోటీసులు ఇవ్వడాన్ని కూడ ఆయన తప్పుబట్టారు.